మల్లవరం శివాలయంలో చోరీ
గోకవరం: మల్లవరం గ్రామంలో ఉమామల్లేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో చోరీ జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల వివరాల ప్రకారం.. కార్తిక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి 10 గంటల వరకూ మల్లవరం శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం తాళాలు వేశారు. సోమవారం తెల్లవారుజామున 3.30 సమయంలో ఆలయ అర్చకుడు సాయిశర్మ తాళాలు తెరిచి చూడగా ఆలయ ప్రాంగణంలో హుండీలు చోరీకి గురైనట్టు గుర్తించి కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా నాలుగు హుండీలను పగులగొట్టి నగదు చోరీ చేసినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా కోరుకొండ సీఐ సత్యకిశోర్, గోకవరం ఎస్సై పవన్కుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. ఆలయ సమీపంలో రెండు హుండీలను గుర్తించారు.


