నంబర్‌ గేమ్‌కు కొండంత అండ | - | Sakshi
Sakshi News home page

నంబర్‌ గేమ్‌కు కొండంత అండ

Nov 5 2025 8:09 AM | Updated on Nov 5 2025 8:09 AM

నంబర్‌ గేమ్‌కు  కొండంత అండ

నంబర్‌ గేమ్‌కు కొండంత అండ

ఫ కాకినాడ పోలీసుల

అదుపులో నిర్వాహకులు

ఫ పట్టుబడ్డ ముగ్గురు

టీడీపీ ప్రజాప్రతినిధి అనుయాయులు

కాకినాడ క్రైం: నగరంలో నంబర్‌ గేమ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి స్పెషల్‌ బ్రాంచ్‌ బృందం కాకినాడలోని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ఆ సందర్భంగా సంతచెరువు పార్క్‌, కల్పనా సెంటర్‌, జగన్నాథపురం మార్కెట్‌లో గుట్టు చప్పుడు కాకుండా నంబర్‌ గేమ్‌ లాటరీ నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ముగ్గురూ స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. వీరిలో ఓ వ్యక్తి లారీల ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేసేవాడు. మరొకరు గత టీడీపీ హయాం నుంచీ ఇదే చీకటి దందాను జీవనోపాధిగా మలచుకొని రూ.కోట్లకు పడగెత్తాడు. మూడో వ్యక్తి ఫ్లెక్సీల్లో మెరుస్తూంటాడు. పండగ పబ్బాలొస్తే తన అభిమాన నాయకుడిని శుభాకాంక్షలు, అభినందనలతో ముంచెత్తుతూంటాడు. తన వినయం ఊరందరికీ తెలిసొచ్చేలా భారీ ఫ్లెక్సీలు కట్టి మురిసిపోతూంటాడు. నేత అండతో చిన్నాచితకా కాంట్రాక్టులు పొందుతూంటాడు. ఈ ఏడాది నంబర్‌ గేమ్‌ లాటరీని అనధికార వేలం పాటలో దక్కించుకున్న వారిలో ఈ ముగ్గురూ ఉన్నారు. టీడీపీ నాయకుడికి నెలవారీ కలెక్షన్లలో వాటాలిచ్చి కొండంత అండతో తమ పబ్బం గడుపుకొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీరితో పాటు ఇంకెంతమంది ఉన్నారనే కోణంలో పోలీసు విచారణ కొనసాగుతోంది. పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి నేపథ్యంలో పట్టుబడిన వారికి తగిన శిక్ష పడుతుందా అనే చర్చ సామాన్యులతో పాటు కూటమి కేడర్‌లోనూ నడుస్తోంది.

రామకృష్ణపై

సస్పెన్షన్‌ వేటు

ఫ పార్టీ వ్యతిరేక

కార్యకలాపాలపై చర్యలు

ఫ దాడిశెట్టి రాజా హెచ్చరిక

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా రౌతులపూడి మండలానికి చెందిన రాపర్తి రామకృష్ణను వైఎస్సార్‌ సీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. గుమ్మరేగుల గ్రామానికి చెందిన రామకృష్ణ పార్టీలో జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానిక కార్యకర్తలు, నేతలకు కనీస సమాచారం లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం, ఇతర పార్టీల నాయకులతో చెట్టపట్టాలేసుకుని తిరగడం, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలతో సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేసుకోవడం వంటి ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఇప్పటికే మూడు పర్యాయాలు ఈ విషయాలపై హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెట్టడంతో క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మంగళవారం మీడియాకు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు ఇదే రీతిలో ఉంటాయని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement