భక్తజన సంద్రమైన రత్నగిరి
అన్నవరం: రత్నగిరి మంగళవారం సాయంత్రం నుంచి భక్తజన సంద్రంగా మారింది. బుధవారం కార్తిక పౌర్ణమి కావడంతో సత్యదేవుని దర్శించేందుకు వేలాదిగా భక్తులు మంగళవారం సాయంత్రం నుంచే రత్నగిరికి తరలి రావడం ప్రారంభించారు. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పలు రైళ్ల నుంచి వేలాది మంది భక్తులు అన్నవరం రైల్వే స్టేషన్‌లో దిగారు. దీంతో, స్టేషన్ ఆవరణంతా కిటకిటలాడింది. వీరందరూ దేవస్థానం బస్సులు, ఆటోల్లో రత్నగిరికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయానికి రత్నగిరికి సుమారు 25 వేల మంది చేరుకున్నారు. ఇంకా బుధవారం తెల్లవారుజామున వచ్చే రైళ్లు, బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వీరి సంఖ్య సుమారు లక్షకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. రద్దీని తట్టుకునేందుకు వీలుగా సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకే తెరచి, వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దాదాపు ఆ సమయం నుంచే స్వామివారి దర్శనాలకు కూడా భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. వ్రత మండపాలతో పాటు నిత్య కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు పశ్చిమ రాజగోపురం వద్ద కంపార్టుమెంట్ల ద్వారా భక్తులను క్రమపద్ధతిలో స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించే మహిళల కోసం ఇనుప ర్యాకులు ఏర్పాటు చేశారు. వీటిని వాడపల్లి ఆలయం నుంచి తీసుకు వచ్చారు. దేవస్థానంలో ఏర్పాట్లను ఆర్‌జేసీ త్రినాథరావు, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, లోవ, వాడపల్లి దేవస్థానాల ఈఓలు విశ్వనాథరాజు, సూర్యచక్రధరరావు పర్యవేక్షిస్తున్నారు. సత్యదేవుని మంగళవారం సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 జరిగాయి. సుమారు 5 వేల మందికి పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది.


