గిరి ప్రదక్షిణకు రెడీ
అన్నవరం: కొండ పైకి ఎక్కి తన దర్శనానికి రాలేని దీనులకు దర్శనమిచ్చేందుకు.. సాక్షాత్తూ ఆ సత్యదేవుడే.. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై.. స్వయంగా రత్నగిరి దిగివచ్చే మహోన్నత కార్యక్రమం.. స్వామివారి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పల్లకీ మీద, మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రచార రథం మీద సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రెండు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఉదయం 8 గంటల నుంచే గిరి ప్రదక్షిణ నిర్వహించేవారు. ఆ సమయంలో అటు సత్యదేవుని దర్శనానికి రత్నగిరికి వచ్చే భక్తులు, ఇటు గిరి ప్రదక్షిణ భక్తులతో కొండ దిగువన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచి ఉదయం పల్లకీ మీద వైదిక సిబ్బందితో లాంఛనంగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సత్యదేవుని ప్రచార రథంతో అధికారికంగా గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. రెండు కార్యక్రమాల్లోనూ భక్తులు పాల్గొనవచ్చని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.
ఏర్పాట్లపై సమీక్ష
ఈ కార్యక్రమం ఏర్పాట్లను గిరి ప్రదక్షిణ ప్రత్యేక అధికారి, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) వి.త్రినాథరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సాయంత్రం సమీక్ష జరిపారు. విభాగాల వారీగా చేసిన ఏర్పాట్లు తెలుసుకుని తగు ఆదేశాలిచ్చారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, వాడపల్లి, లోవ దేవస్థానం ఈఓలు నల్లం సూర్యచక్రధరరావు, విశ్వనాథరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం గిరి ప్రదక్షిణ రోడ్డును త్రినాథరావు పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని త్రినాథరావు కోరారు.
ఫ అన్నవరం పుణ్యక్షేత్రంలో నేడు నిర్వహణ
ఫ ఉదయం 8 గంటలకు పల్లకీ మీద
ఫ మధ్యాహ్నం 2 గంటలకు
సత్యరథంతో కార్యక్రమం
ఫ సాయంత్రం 6.30 గంటలకు
పంపా హారతులు
ఫ రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం
ఫ విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు
మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ ప్రణాళిక ఇదీ..
ఫ మధ్యాహ్నం 1.30 గంటలకు గ్యారేజీ నుంచి సత్యదేవుని ప్రచార రథం తొలి పావంచా వద్దకు చేరుకుంటుంది. ప్రచార రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు పూజలు చేసి, హారతులిచ్చిన అనంతరం రెండు గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది.
ఫ తొలి పావంచా నుంచి 8.5 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ సాగుతుంది.
ఫ తొలి పావంచా నుంచి హైవే ఆర్చి వరకూ 2 కిలోమీటర్లు అన్నవరం మెయిన్ రోడ్డు మీద.. ఆర్చి నుంచి బెండపూడి శివారు పుష్కర కాలువ వరకూ 1.5 కిలోమీటర్లు జాతీయ రహదారి–16 మీద రాజమహేంద్రవరం – విశాఖపట్నం లైనులో ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
ఫ పుష్కర కాలువ రోడ్డు నుంచి పంపా నది వరకూ 5 కిలోమీటర్లు మెటల్ రోడ్డు మీద గిరి ప్రదక్షిణ జరుగుతుంది.
ఫ మార్గం మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి గుడి సెంటర్, సాక్షి గణపతి ఆలయం, పాత రత్నగిరి రిసార్ట్స్ సెంటర్, జాతీయ రహదారి మీద ఆర్చి, పుష్కర కాలువ ప్రారంభంలో, మధ్యలో మరో రెండుచోట్ల కొంతసేపు ఆపుతారు.
ఫ గిరి ప్రదక్షిణ మార్గంలో 12 చోట్ల మంచినీరు, పాలు, బిస్కెట్లు, పులిహోర, పండ్లు పంపిణీ చేస్తారు. ఐదుచోట్ల టాయిలెట్లు ఏర్పాటు చేశారు.
ఫ భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నాలుగుచోట్ల ఏర్పాట్లు చేశారు.
ఫ గిరి ప్రదక్షిణ పూర్తయ్యేటప్పటికి సాయంత్రం 6 గంటలు దాటే అవకాశం ఉండటంతో.. ఆ మార్గంలో విద్యుద్దీపాలు అమర్చారు.
ఫ సాయంత్రం 6 గంటలకు పంపా నది వద్ద తెప్పోత్సవ పంటు మీద సత్యదేవుని పంపా నదీ హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. తొలుత సత్యదేవునికి పూజలు చేసిన అనంతరం అర్చకులు పంపా నదికి చీర, సారె సమర్పి స్తారు. ఆ తరువాత నదీమతల్లికి పంచహారతులు సమర్పిస్తారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారు.
ఫ రాత్రి 7 గంటలకు తొలి పావంచా వద్ద సత్యదేవుని జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఫ పెద్దాపురం, కాకినాడ డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 16 మంది ఎస్సైలు, 724 మంది పోలీసులతో పాటు రెండు రోప్ పార్టీలు భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటున్నాయి.
ఫ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగం నుంచి ఆరుగురు తహసీల్దార్లు, 20 మంది వీఆర్‌ఓలు కూడా ఈ ఏర్పాట్లలో పాల్గొంటున్నట్లు పెద్దాపురం ఇన్‌చార్జి ఆర్‌డీఓ మల్లిబాబు తెలిపారు.
గిరి ప్రదక్షిణకు రెడీ
గిరి ప్రదక్షిణకు రెడీ


