ఎస్‌ఐఎఫ్‌టీ ల్యాబ్‌లకు జాతీయ గుర్తింపు
కాకినాడ రూరల్: ఇక్కడి రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ(ఎస్‌ఐఎఫ్‌టీ)లోని మరో రెండు ల్యాబ్‌లకు కొత్తగా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) గుర్తింపు లభించింది. దీంతో పాటు ఇక్కడ పాటిస్తున్న ప్రమాణాలకు గానూ ఎస్‌ఐఎఫ్‌టీలోని 4 ల్యాబ్‌లకు గతంలో ఇచ్చిన గుర్తింపును కొనసాగించనున్నారు. శాసీ్త్రయంగా అవసరాలకు అనుగుణంగా ఆక్వా రైతులకు సేవలు అందించడంలోను, మత్స్య ఉత్పత్తుల నాణ్యత పెంపొందించడంలోను ఎస్‌ఐఎఫ్‌టీ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడి నీరు, మట్టి నమూనా విశ్లేషణ పరీక్షా ల్యాబ్‌కు.. సూక్ష్మజీవ, వ్యాధి నిర్ధారణ (మైక్రో బయాలజీ) ల్యాబ్‌కు, మాలిక్యులర్ లెవెల్ డయాగ్నోసిస్ (పీసీఆర్) ల్యాబ్‌కు, మేత నాణ్యత విశ్లేషణ (ఫీడ్) ల్యాబ్‌లకు 2021 ఆగస్టులో ఐఎస్‌ఓ/ఐఈసీ 17025–2017 ప్రమాణాల మేరకు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించింది, అప్పటి నుంచీ ఈ గుర్తింపును ఏటా పునరుద్ధరిస్తున్నారు. ఈ ఏడాది గడువు గత ఆగస్టు 8తో ముగిసింది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రెన్యువల్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం గతంలో గుర్తింపు పొందిన 4 ల్యాబ్‌లకు ఎన్‌ఏబీఎల్ గుర్తింపు కొనసాగింపునకు అనుమతి ఇచ్చారు. దీంతోపాటు కొత్తగా మరో రెండు ల్యాబ్‌లు ఎల్‌సీ–ఎంఎస్/ఎంఎస్, జీసీ–ఎంఎస్/ఎంఎస్‌లకు కూడా ఎన్‌ఏబీఎల్ గుర్తింపు లభించింది. లిక్విడ్ క్రోమోటోగ్రఫీ విత్ టాండమ్ మాస్ స్పెక్రోమెట్రీ (ఎల్‌సీ–ఎంఎస్/ఎంఎస్) ల్యాబ్ ద్వారా చేపలు, చేప ఉత్పత్తుల్లో ఉండే యాంటీబయాటిక్స్‌ను గుర్తిస్తారు. గ్యాస్ క్రోమోటోగ్రఫీ విత్ టాండన్ మాస్ స్పెక్రోమెట్రీ (జీసీ–ఎంఎస్/ఎంఎస్) ల్యాబ్ ద్వారా పెస్టిసైడ్స్‌ను గుర్తిస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
ఎస్‌ఐఎఫ్‌టీ ల్యాబ్‌లలో పరీక్షించిన ఉత్పత్తుల కు మాత్రమే అంతర్జాతీయంగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలో జియోట్యాగ్ అయిన 5.76 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా రైతులు తమ ఉత్పత్తుల పరీక్షల నిర్వహణకు రాష్ట్ర రిఫరల్ ల్యాబ్‌గా ఉన్న ఎస్‌ఐఎఫ్‌టీ సేవలను వినియోగించుకోవచ్చు.
– డాక్టర్ ఎస్.అంజలి, ప్రిన్సిపాల్,
ఎస్‌ఐఎఫ్‌టీ, కాకినాడ


