బాలాజీచెరువు (కాకినాడ సిటీ):
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి. ప్రస్తుతం సర్వీసు కొనసాగించాలన్నా, ఉద్యోగోన్నతి పొందాలన్నా వారు టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణులు కావాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై వివిధ రాష్ట్రాలు రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతూండగా.. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం టెట్ నిర్వహణకు కసరత్తు చేస్తోంది. పైగా రెండేళ్లలోపు టెట్ పాస్ కావాలంటూ నిబంధన విధించారు. దీనిపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కొన్ని మార్పులు చేపట్టారు. విద్యార్హతలతో పాటు వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో టెట్‌ను ప్రవేశపెట్టారు. ఎప్పుడో 20, 25 ఏళ్ల కిందట ఎంపికై న తమకు ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత సాధించడం సాధ్యమవుతుందా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు పాఠాలు బోధించి, పరీక్షలు నిర్వహిస్తున్న తమకే ఇప్పుడు పరీక్షా కాలం ఎదురవుతోందని జిల్లాలోని టీచర్లు ఆవేదన చెందుతున్నారు.
వారికి తప్పనిసరి
జిల్లాల్లో 2010 నుంచి ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారందరూ టెట్ ఉత్తీర్ణత పొందినవారే. అంతకంటే ముందు డీఎస్సీలో మాత్రమే ప్రతిభ చూపి ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారు జిల్లాలో దాదాపు 4 వేల మంది వరకూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల లోపు ఉద్యోగ విరమణ పొందేవారు మినహా మిగతా వారందరూ 2027 ఆగస్టు 31 లోగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. అలా జరగకపోతే ఉద్యోగం వదులుకోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై జిల్లాలోని వేలాది మంది టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
సర్వీసు నిబంధనల్లో లేకున్నా..
2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరనే విషయం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల్లో ఎక్కడా లేదని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ సైతం వృత్తిలో ఉన్న టీచర్లు టెట్ అర్హత కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఎక్కడా ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. దీనిని కేవలం ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునే వారికి మాత్రమే వర్తింపజేయాలని చెబుతున్నారు.
రివ్యూ పిటిషన్ వేయాలి
టెట్ పరీక్షపై వేలాది మంది టీచర్లు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూటమి ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా ఏ మాత్రం స్పందన లేదు. ఉద్యోగోన్నతి పొందడానికి టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని పలువురు కోరుతున్నారు. బోధన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగంలో కొనసాగడానికి, 50 సంవత్సరాలు దాటిన వారికి ఉద్యోగోన్నతి పొందేందుకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉద్యోగోన్నతి తర్వాత టెట్ పాసవడానికి నాలుగేళ్ల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పాథమిక పాఠశాలలు 933
ప్రాథమికోన్నత పాఠశాలలు 105
ఉన్నత పాఠశాలలు 247
మొత్తం 1,285
విధులు నిర్వహిస్తున్న టీచర్లు 7,150
ఫ సర్వీసులో ఉన్న టీచర్లు
టెట్ రాయాల్సిందేనన్న ‘సుప్రీం’
ఫ ఆ దిశగా కూటమి సర్కారు కసరత్తు
ఫ ఆందోళనలో ప్రభుత్వ ఉపాధ్యాయులు
ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
సర్వీసులో ఉన్న టీచర్లు టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీం తీర్పుపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. త్వరలోనే టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెబుతున్నారు. టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా జీఓ జారీ చేయాలి.
– వాకాడ వెంకటరమణ, జిల్లా సీపీఎస్ ఉద్యోగుల సంఘం కన్వీనర్
మానవీయ కోణంలో పరిశీలించాలి
టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న తీర్పును అత్యున్నత న్యాయస్థానం మానవీయ కోణంలో పరిశీలించాలి. టెట్‌కు ప్రిపేరయ్యేందుకు సమయం ఉండదు. దీనిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలి. రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగం వదులుకోవాలని చెప్పడం దారుణం.
– చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
ఠాట్.. వీల్లేదు


