ఇలాంటి నిబంధనలు ఎప్పుడూ చూడలేదు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుపాను దెబ్బకు నేలపాలైంది. మాబోటి రైతుల పరిస్థితి అయోమయంలో పడింది. నష్టపరిహారం అందుకుంటే మునిగిపోగా మిగిలిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనని అంటే ఎలా? ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదు. క్షేత్ర స్థాయిలో 33 శాతం పైన పంట నష్టపోయిన రైతుల పేర్లు మాత్రమే రాస్తున్నారు. ఇది దారుణం. పైగా ఆ సర్వే నంబర్లలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పడం అన్యాయం. మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి? ఇలాంటి నిబంధనలతో రైతును మరిన్ని నష్టాల్లోకి నెట్టేయడం కాకుండా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి.
– పితాని సుబ్రహ్మణ్యం, రైతు, పీఏసీఎస్ మాజీ చైర్మన్, తణుకువాడ, కాజులూరు
పరిహారానికి, కొనుగోలుకు ముడి పెడతారా?
నష్ట పరిహారానికి, ధాన్యం కొనుగోలుకు ముడి పెట్టడం అన్యాయం. తుపానుతో దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి ఇలాంటి నిబంధనలు పెట్టడం సమంజసం కాదు. నష్టపరిహారం పొందిన రైతుల నుంచి సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయబోమని అంటే ఏమైపోవాలి? ఈ మాట చాలా వింతగా ఉంది. ఇది సరైన విధానం కాదు. ముంపుతో పోయిన ధాన్యం ఎలానూ పోయింది. కనీసం మిగిలిన ధాన్యాన్నయినా ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందనుకుంటే ఇప్పుడు ఇలా చెప్పడం అన్యాయం. ప్రభుత్వం పరోక్షంగా దళారులను ప్రోత్సహించినట్టే. ఈ విధానాన్ని విరమించుకోవాలి.
– బదిరెడ్డి వీర ప్రకాశరావు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం
ఇలాంటి నిబంధనలు ఎప్పుడూ చూడలేదు


