
విద్యారంగ సమస్యలపై ర్యాలీ
1500 మందితో భారీ ర్యాలీ
బోట్‌క్లబ్: విద్యారంగంలోని సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 1500 మందితో భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, ఎం. గంగా సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యా అందని ద్రాక్షగా తయారయిందని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్య మొత్తం కేంద్రీకరణ, కాషాయీకరణ, ప్రైవేటీకరణ అవుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోను పూర్తిగా అమలు చేయనటువంటి నూతన జాతీయ విద్యావిధానాన్ని మన రాష్ట్రం అమలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేస్తామని, చెప్పి నేడు ఎటువంటి మార్పులు లేకుండా గత ప్రభుత్వం చేసిన విధానాల్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.6400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో చదువుకున్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం వేయక, విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకుండా, విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. శాశ్వత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటూ అరకొర సౌకర్యాలతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని 2018లో ఇచ్చిన మెనూనే, నేటికీ అమలు చేయాలని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడం దుర్మార్గమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను రూ.3 వేలకు పెంచాలని, విద్యార్థులకు ఇచ్చే కాస్మోటిక్ చార్జీలు ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి, ప్రత్తిపాడు, కోటనందూరు మండలాల్లో జూనియర్ కళాశాలలకు భవనాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్‌కు శాశ్వత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటూ బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు చదువులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కాకినాడ నడిబొడ్డున ఉన్న అంబేడ్కర్ హాస్టల్‌కు గత మూడేళ్ల నుంచి నూతన భవనం నిర్మిస్తున్నామని చెప్పి, నేటికీ భవనం పూర్తయినా ప్రారంభించకుండా జిల్లా అధికారులు ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు. అనంతరం దాదాపు 54 సమస్యలను గుర్తించి వినతి పత్రాన్ని జేసీ రాహుల్ మీనాకు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు సిద్ధూ, సాహిత్, వాసుదేవ్, నాగరాజు, మణికంఠ, ఉదయ్‌కుమార్, జయరాం, సత్యం, చిన్ని, గోపాలకృష్ణ, రవి, నాని, తదితరులు పాల్గొన్నారు.