రత్నగిరి కిటకిట | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి కిటకిట

Aug 15 2025 6:46 AM | Updated on Aug 15 2025 6:46 AM

రత్నగిరి కిటకిట

రత్నగిరి కిటకిట

స్వామివారిని దర్శించిన

40 వేల మంది భక్తులు

2,500 వ్రతాల నిర్వహణ

అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం గురువారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలు చేసుకున్న నవ దంపతులు వారి బంధువులు సత్యదేవుని వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శించారు. పెళ్లిబృందాలు తమ వాహనాలను ఘాట్‌రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో ఉదయం పది గంటల వరకు ఘాట్‌రోడ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు శ్రీగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించారు. తరువాత రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. కాగా, గురువారం స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు.

నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు

కాగా, గురువారం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల నిజరూప దర్శనంతో భక్తులు పులకించారు. ప్రతి సోమవారం ముత్యాల కవచాలతో, గురువారం ఏ విధమైన అలంకరణ లేకుండా నిజరూప దర్శనంతో అలంకరిస్తున్న విషయం తెలిసిందే.

నేడు బీఎస్‌ఎన్‌ఎల్‌

మేళాలు, రోడ్‌షోలు

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పలు ప్రాంతాలలో మేళాలు, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ పలివెల రాజు ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం ఒక్క రూపాయికే ఒక సిమ్‌ కార్డ్‌ అందిస్తున్నామని, దానితో 30 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ బిఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తుందన్నారు. అందరూ ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఆక్వా చెరువుల్లో నమూనాల సేకరణ

రామచంద్రపురం రూరల్‌: ఆక్వా సాగులో ప్రభలుతున్న వ్యాధుల పర్యవేక్షణ, నివారణకు నేషనల్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఆక్వాటిక్‌ యానిమల్‌ డిసీజ్‌–ఫేజ్‌ 2 ప్రాజెక్టులో భాగంగా ఆక్వా రైతులకు సహాయ సహకారాలు అందించనున్నట్లు ఫిషరీస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.శ్రావణి తెలిపారు. తాటిపల్లి, చోడవరం గ్రామాల్లోని ఆక్వా చెరువుల నుంచి వ్యాధి నిర్ధారణకు గురువారం నమూనాలు సేకరించారు. ఆ శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.అంజలి ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌పీఏఏడీ బృందం సభ్యులు శివరామకృష్ణ, డి.వంశీ, వి.కృష్ణకిశోర్‌ పాల్గొన్నారు.

17న అరటి మార్కెట్‌కు సెలవు

అంబాజీపేట: స్థానిక మార్కెట్‌ యార్డులో నిర్వహిస్తున్న అరటి మార్కెట్‌ ఈ నెల 17వ తేదీన సెలవు ప్రకటించినట్టు మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.రమేష్‌ తెలిపారు. ఇటీవల నూతనంగా నియమితులైన మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమణ స్వీకారం సందర్భంగా అరటి మార్కెట్‌ సెలవు ఇచ్చినట్టు తెలిపారు. రైతులు సహకరించాలని కార్యదర్శి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement