
తూచ్.. ఉచితం కొన్నింటికే!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఎప్పటిలాగే చంద్రబాబు కోతలపై కోతలు పెట్టారు. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణమని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. తీరా గద్దె నెక్కాక మాట మార్చి ఇప్పుడు ఉచిత ప్రయాణాన్ని కొన్ని బస్సులకే పరిమితం చేశారని మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. ఆల్ ఫ్రీ బాబు తమను మరోసారి దగా చేశారని మండిపడుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి ఇంత మోసం చేస్తారా అని నిలదీస్తున్నారు. ఆర్టీసీలో తొమ్మిది రకాల బస్సు సర్వీసులుండగా ఐదు రకాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మహిళలు ఆక్షేపిస్తున్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్‌స్టాఫ్, స్టార్ లైనర్, సప్తగిరి, ఏసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతించడం లేదు. అంతర్రాష్ట్ర సర్వీసులు, స్పెషల్ బస్సుల్లో సైతం ఉచితం పనిచేయదని చెప్తున్నారు. ఉచితంగా ప్రయాణించాలనుకునే మహిళలు రాష్ట్రానికి చెందిన వారై ఇక్కడి ధ్రువీకరణ పత్రాలు ఉండాలనేది నిబంధన. రాష్ట్రంలోనే నివసిస్తున్నట్లు ధ్రువీకరణ కూడా చూపించాలి. ఆగస్టు 15 శుక్రవారం నుంచి పరిమిత సంఖ్యలో అనుమతించిన బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
నాన్‌స్టాప్‌లకు అవకాశం లేదు
పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నుంచి అటు అమలాపురం, ఇటు రాజమహేంద్రవరానికి అత్యంత రద్దీగా నడిచే నాన్‌స్టాప్ బస్సులలో ఉచిత ప్రయాణానికి అవకాశం లేకుండా చేశారు. సహజంగా ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రూట్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. జిల్లా కేంద్రాలుగా ఉన్న కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు కేంద్రాల్లో ప్రాముఖ్యం కలిగి, పేద రోగులకు అత్యవసర వైద్యం అందించే ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులు రెండు ఉన్నాయి. నిత్యం వందలాది మంది మహిళలు రాజమహేంద్రవరం వస్త్ర వ్యాపారానికి వెళ్తుంటారు. అటువంటి రూట్‌లో నాన్‌స్టాప్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీలో ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ బస్సులనే నాన్‌స్టాప్ సర్వీసులుగా నడుపుతున్నారు. అయినప్పటికీ వీటిల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించరు.
బస్సులు లేక ఆటోలే ప్రత్యామ్నాయం
ఆదాయం లేకపోతే నడపటం కష్టమనే సాకులతో కాకినాడ జిల్లాలో మూడు డిపోల పరిధిలో 90 గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రయాణికులకు ఆటోలే ప్రత్యామ్నాయం అవుతున్నాయి. కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోల పరిధిలో ఇప్పుడున్న ఆర్టీసీ బస్సులే సరిపోవడం లేదు. ఇక ఉచిత ప్రయాణం కచ్చితంగా అమలు చేస్తే కాకినాడ జిల్లాలోని మూడు డిపోల పరిధిలో అదనంగా 100 బస్సులు అవసరం అవుతాయని ఆర్టీసీ అధికారులే లెక్కలు వేశారు. ఉన్న పల్లె వెలుగు సర్వీసులను ఉచిత పథకానికి వినియోగిస్తే జిల్లాలోని ఏ గ్రామీణ ప్రాంతానికీ బస్సులు నడిచే పరిస్థితులు ఉండవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పోస్టులు భర్తీ చేయాలి
జిల్లాలోని ఏలేశ్వరం, తుని, కాకినాడ ఆర్టీసీ డిపోల్లో మొత్తం 194 బస్సులున్నాయి. ఇందులో 177 బస్సులకు ఉచిత ప్రయాణానికి అనుమతించినట్టు ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలియచేశారు. గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలో ఆర్టీసీ సేవలు ఇప్పటికే అరకొరగా ఉన్నాయి. జిల్లాలో డ్రైవర్, కండక్టర్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా అమలుచేస్తారని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
అదనంగా వంద బస్సులు అవసరం
జిల్లాలో 12 లక్షల మంది మహిళలు ఉన్నారని అంచనా. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకారం చూసుకుంటే అన్ని లక్షల మందికి బస్సులు ఏర్పాటుచేయాలి. కానీ అన్ని బస్సులు ఆర్టీసీ యాజమాన్యానికి లేవు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఉచిత బస్సు ప్రయాణం అమలుచేయాలంటే జిల్లాలో మూడు డిపోల పరిధిలో అదనంగా వంద బస్సులు అవసరమవుతాయని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో మూడు డిపోల పరిధిలో 34,407 కిలోమీటర్లను కలుపుతూ సర్వీసులు తిరుగుతుంటాయి. నిత్యం 80 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికులు 35 వేల మంది ఉన్నారని అంచనా. ఇంత మంది మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలంటే ఇప్పుడున్న బస్సులతో పాటు సిబ్బంది సంఖ్యను మరింత పెంచాలంటున్నారు. 100 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్లు అవసరమవుతారని చెబుతున్నారు. ఉన్న బస్సులతోనే సరిపెట్టుకోమంటే ఉచిత బస్సు ప్రయాణం ఎలా ముందుకు తీసుకువెళతామని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా సర్వీసులు లేకపోవడం వల్ల తమపైన, ఉన్న సర్వీసులపైనా అధిక భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న పల్లెవెలుగు సర్వీసులను ఉచిత బస్సుల కోసం ప్రధాన ప్రాంతాల్లో నిర్వహిస్తే పల్లెల్లో బస్సు సర్వీసు పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కొత్త బస్సుల ఊసేలేదు. త్వరలో 25 ఎలక్ట్రికల్ బస్సులు జిల్లాకు వస్తున్నాయని మాత్రం చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి డిపోకు కొత్త బస్సులను అందజేస్తామని కూటమి నేతలు చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. కాకినాడ సిటీలో ఎలక్ట్రికల్ బస్సుల మాట ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఒక్క బస్సు కూడా ఏర్పాటు చేయకుండా ఉన్న బస్సులతోనే సరిపెట్టుకోమంటే ఎలా అని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు తప్పనిసరి చేశారు. అందుకు కండక్టర్‌కు సరైన ధ్రువపత్రం తప్పనిసరిగా చూపించాలి. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్, పాస్‌పోర్టు, స్థానికతను ధ్రువీకరించే ఏదో ఒక గుర్తింపు కార్డు చూపడం తప్పనిసరి. పొరపాటున వాటిలో ఏదేని ఒరిజినల్ ధ్రువపత్రాన్ని జారవిడుచుకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకుని అది వచ్చేవరకు తమ ఉచిత ప్రయాణానికి ఆటంకమేనని మహిళలు చర్చించుకుంటున్నారు.
ఈ బస్సు మీకు ఆగదు.......
నేటి నుంచే ఉచిత ప్రయాణం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్రశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలి. నాన్‌స్టాప్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే పర్యాటక, లగ్జరీ, సూపర్ లగ్జరీ, సప్తగిరి, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, ఏసీ బస్సులు ఈ పథకానికి వర్తించవు.
– శ్రీనివాసరావు, జిల్లా ప్రజారవాణాధికారి
9 సర్వీసులలో మూడింటికే పరిమితం
జిల్లాలోని మూడు డిపోలలో కేవలం 177
బస్సులలోనే ప్రయాణానికి అనుమతి
డిమాండ్‌కు సర్వీసులకు
పొంతన లేని వైనం
ఆ 90 రూట్ల మాటేవిటంటున్న గ్రామీణులు
నిత్యం ప్రయాణించే 80 వేల మందిలో 35 వేల మంది మహిళలే
మౌలిక వసతులు విస్మరించి
మొక్కుబడి వాగ్దానాల అమలుకు యత్నం

తూచ్.. ఉచితం కొన్నింటికే!

తూచ్.. ఉచితం కొన్నింటికే!