
సమాచార హక్కు చట్టంపై ర్యాలీ
అమలాపురం టౌన్: సమాచార హక్కు మన ప్రాథమిక హక్కు అనే నినాదంతో జిల్లాలోని సహకార శాఖ ఉద్యోగులు అమలాపురంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా సహకార అధికారి ఎ.రాధాకృష్ణారావు, సహకార అసిస్టెంట్ రిజిస్ట్రార్లు బీఎల్‌వీపీ నూకరాజు, టి.బుజ్జయ్య, సత్యప్రసాద్ ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కూచిమంచి అగ్రహారంలోని జిల్లా సహకారి అధికారి (డీసీవో) కార్యాలయం వద్ద ర్యాలీని డీసీవో రాధాకృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా డీసీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది, 166 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీవో రాధాకృష్ణారావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు జవాబుదారీతనంతో పనిచేస్తాయని గుర్తు చేశారు. కాగా.. జిల్లా సహకార కార్యాలయం నుంచి మొదలైన ర్యాలీ.. బ్యాంక్ స్ట్రీట్ మీదుగా గడియారం స్తంభం సెంటర్ వరకూ జరిగింది.