
ప్రాణం తీసిన చెట్టు
● ఉద్యోగానికి వెళుతుండగా కూలిన వృక్షం
● దుళ్ల యువకుడి మృతి
కడియం: చెట్టు కూలి మీద పడడంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి వెళుతున్న యువకుడు మృతి చెందాడు. పాయకరావుపేట మండలం రాంభద్రపురం – శ్రీరాంపురం మధ్య ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన తొట్టా శ్రీనివాస్ (31) అనకాపల్లి జిల్లా కేశవరం డెక్కన్ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం తన క్వార్టర్స్ నుంచి స్నేహితుడితో కలిసి ఫ్యాక్టరీకి వెళుతున్నాడు. రాంభద్రపురం–శ్రీరాంపురం మధ్యకు వచ్చేసరికి ఓ భారీ వృక్షం కూలి వీరు వెళుతున్న మోటారు సైకిల్‌పై పడింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చెట్టు కింద ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం
శ్రీనివాస్‌కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. పెళ్లయిన తర్వాత ఆరు నెలలకు అనకాపల్లి జిల్లా కేశవరంలోని డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. దీంతో తునిలోని బ్యాంక్ కాలనీలో భార్యతో సహా నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. అతడి హఠాన్మరణంతో వారంతా తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. కాగా.. దుళ్లలో మృతుడి కుటుంబాన్ని పలువురు పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారిగా హరికృష్ణ
అన్నవరం: స్థానిక దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారిగా డాక్టర్ అల్లు హరికృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు తుని అర్బన్ పీహెచ్‌సీలో పనిచేశారు. అక్కడ రాజీనామా చేసి అన్నవరంలో చేరారు. డాక్టర్ హరికృష్ణ అనస్థీషియాలో ఎండీ కూడా చేశారు. గతంలో దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారిగా పనిచేసిన శ్రీకాంత్ గత నెల 12న రౌతులపూడి ఆస్పత్రి డాక్టర్‌గా నియమితులవ్వడంతో ఈ పోస్టు అప్పటి నుంచి ఖాళీగా ఉంది. గత నెల 31న స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో దేవస్థానం ఆస్పత్రిలో వైద్యాధికారి లేక సకాలంలో వైద్యం లభించలేదు. వారి పరిస్థితి విషమించడంతో తుని ప్రభుత్వాస్పత్రికి పంపాల్సి వచ్చింది.
‘సాక్షి’ చొరవతో..
ఈ సమస్యపై ఆగస్టు ఏడున సాక్షి దినపత్రికలో ‘వైద్యం... పూజ్యం ’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దానిపై స్పందించిన కమిషనర్ రామచంద్ర మోహన్ వెంటనే వైద్యుడిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. దీంతో డాక్టర్ హరికృష్ణను నియమించారు. ఆయన గురువారం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిశారు.

ప్రాణం తీసిన చెట్టు

ప్రాణం తీసిన చెట్టు