మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

Published Wed, May 22 2024 12:45 AM

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

పెద్దాపురం: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కాకినాడలోని ఎన్‌సీసీ 18వ ఆంధ్రా బెటాలియన్‌ కమాండెంట్‌ కల్నల్‌ వివేక్‌ సావన్‌ గౌడర్‌ అన్నారు. ఆంధ్రా – తెలంగాణ ఎన్‌సీసీ ఇంటర్‌ డైరెక్టరేట్‌ స్పోర్ట్స్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ (ఐడీఎస్‌ఎస్‌సీ)–2024కు ఎంపికై న క్యాడెట్లకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఎన్‌సీసీ క్యాడెట్లతో మంగళవారం యాంటీ డ్రగ్‌, యాంటీ టుబాకో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్‌ వివేక్‌ సావన్‌ గౌడర్‌ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును పాడు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు వాడకంలో మన దేశం ముందంజలో ఉందన్నారు. యువతను సంఘ విద్రోహ శక్తులు మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చివేస్తున్నాయన్నారు. ఎన్‌సీసీతో ప్రతి విద్యార్థికీ మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. దృఢసంకల్పం, ఆత్మ విశ్వాసం, నిబద్ధతతో కూడిన శిక్షణ ఎన్‌సీసీతోనే సాధ్యమని సావన్‌ గౌడర్‌ అన్నారు. అనంతరం సుమారు 520 మంది పురుష, మహిళా క్యాడెట్లతో స్థానిక జవహర్‌ నవోదయ విద్యాలయ నుంచి గుర్రాల సెంటర్‌, దర్గా సెంటర్‌, మెయిన్‌ రోడ్డు మీదుగా మున్సిపల్‌ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. పొగాకు పీల్చకు – జీవిత దీపాన్ని ఆర్పకు, మత్తుకు బానిస అవకు – జీవితాన్ని చిత్తు చేసుకోకు, డ్రగ్స్‌ నిర్మూలన – యువత బాధ్యత అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సుబేదార్‌ హేమంత కుమార్‌, భాస్కర్‌రెడ్డి, కిషోర్‌, తొమ్మిది మంది ఎన్‌సీసీ, 29 మంది ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement