పురం.. అపరిశుభ్రం | - | Sakshi
Sakshi News home page

పురం.. అపరిశుభ్రం

Nov 10 2026 12:43 AM | Updated on Nov 10 2026 12:43 AM

గద్వాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పౌరులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, వీధిలైట్లు నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. డ్రెయినేజీల్లో పూడికతీత చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ మురుగునీరు రోడ్లపై పారుతోంది. అదేవిధంగా శివారు కాలనీల్లో అంతర్గత రహదారులు లేకపోవడంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ పరిస్థితి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ నెలకొనగా.. జిల్లాకేంద్రమైన గద్వాలలో పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. ఇక్కడ ఉన్న కమిషనర్‌ ఒక్కరోజు కూడా ఉదయం వేళలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన పాపాన పోలేదు. కేవలం అధికార పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడానికే పరిమితమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్కడెక్కడ.. ఎలా

గద్వాల మున్సిపాలిటీలో జనాభా సుమారు 60 వేలు కాగా.. 37 వార్డులు ఉన్నాయి. ఇక్కడి చాలా వార్డుల్లో నెలల తరబడి డ్రెయినేజీల్లో పేరుకుపోయిన పూడికను తీయడం లేదు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ సమావేశంలో డ్రెయినేజీలు క్లీన్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కౌన్సిలర్లు మున్సిపల్‌ పాలకవర్గాన్ని, కమిషనర్‌ను నిలదీశారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంతటి దుర్భర పరిస్థితి చూడలేదని వాపోయారు. ఇదిలా ఉంటే జిల్లాకేంద్రమైన గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్‌ మొదలుకొని ఎస్పీ, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వరకు ఇక్కడే నివాసం ఉంటారు. అయితే వీరికి రోడ్లపై దుమ్ము, దూళి, డ్రెయినేజీల్లో పేరుకుపోయిన మురుగు ఏవీ కనిపించవు. కేవలం రోజువారి కార్యక్రమాలకు హాజరు కావడం, ఫొటోలు దిగడంతో తమ పని పూర్తయిందనే పరిస్థితిలో ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇక్కడి మున్సిపల్‌ కమిషనర్‌ జానకిరాం వ్యవహార శైలి నా రూటే సెపరేటు అన్న తరహాలో సాగుతోంది. కేవలం అధికార పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటూ.. సామాన్య ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కౌన్సిలర్లకు కనీసం కనిపించరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మున్సిపల్‌ సమావేశంలో కమిషనర్‌ తీరుపై బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.

● అయిజలో సుమారు 28వేల జనాభా ఉండగా మొత్తం 20వార్డులున్నాయి. ఇక్కడ పట్టణ ప్రజలను కూడా డ్రెయినేజీ, అంతర్గత రోడ్ల సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ప్రధానంగా బస్టాండ్‌, పశువుల ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో ఉన్న అధ్వానపు డ్రెయినేజీ వ్యవస్థతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అంతర్గత కుమ్ములాటలతోనే పాలన సాగిస్తుందనే విమర్శలున్నాయి.

● అలంపూర్‌లో మొత్తం జనాభా సుమారు 12 వేలు ఉండగా ఇక్కడ 10 వార్డులున్నాయి. ఇక్కడ కూడా సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం, అంతర్గత రోడ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

● కొత్తగా ఏర్పడిన వడ్డేపల్లి మున్సిపాలిటీలో జనాభా సుమారు 13 వేలు ఉండగా మొత్తం 10 వార్డులున్నాయి. ఇక్కడ కూడ కనీస మౌళిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా డ్రెయినేజీ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో లోపించిన పారిశుద్ధ్యం

అస్తవ్యవస్తంగా పనులు.. రోడ్లపైనే పారుతున్న మురుగు

అంతర్గత రోడ్లు.. వసతులకు నోచుకోని శివారు కాలనీలు

జిల్లాకేంద్రంలో మరింత

అధ్వాన పరిస్థితులు

నాయకుల చుట్టూ ప్రదక్షిణలకే పరిమితమైన కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement