● స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురం గ్రామంలో వెలసిన పాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అంతకు ముందు ఆదివారం రాత్రి సంప్రదాయం ప్రకారం స్వామివారికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి వాల్మీకి రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్పతో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఈఓ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుని మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, శ్రీధర్‌గౌడ్, బండారి భాస్కర్, రామకృష్ణనాయుడు, ఉరుకుందు, వెంకన్‌గౌడ్, రాజేష్, గోపి, యుగందర్‌గౌడ్, ఆంజనేయులు, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కల్యాణోత్సవం.. ప్రభోత్సవం
సోమవారం స్వామివారి కల్యాణోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గతేడాదితో పోల్చితే ఈసారి భక్తుల రద్దీ పెరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. కొండపై, దిగువన ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపించింది. ఈ ప్రాంతవాసులు తమ ఇంటి ఇలవేల్పుగా కొలిచే లక్ష్మీవేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాసంగాలు పెట్టి.. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం ప్రత్యేక అలంకరణల మధ్య ప్రభోత్సవం నిర్వహించారు.


