● నేడు స్వగ్రామానికి రానున్న సీఎం రేవంత్‌రెడ్డి
● ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. ప్రజాప్రతినిధులు, అధికారులతో భేటీ
● షెడ్యూల్ విడుదల చేసిన సీఎంఓ కార్యాలయం
● పకడ్బందీ ఏర్పాట్లు చేసిన యంత్రాంగం
● పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ.. అధికారులతో సమీక్ష
నాగర్‌కర్నూల్/ వంగూరు: దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ముచ్చటగా మూడోసారి సీఎం హోదాలో మంగళవారం స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రానున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేశారు. గడిచిన మూడేళ్లలో కొండారెడ్డిపల్లిలో దాదాపు రూ.200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి పూర్తిచేసారు. మంగళవారం సీఎం రూ.30 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రూ.10 కోట్లతో నిర్మించనున్న ఏటీసీ సెంటర్, రూ.9.5 కోట్లతో నిర్మించిన ఎస్‌టీపీ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, శ్రీశైలం హైవే నుంచి గ్రామం వరకు ఏర్పాటు చేసిన సోలార్ సెంటర్ లైటింగ్ సిస్టంను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికా రులు ఏర్పాట్లను పూర్తిచేశారు. కొండారెడ్డిపల్లిలో అధికారుల పర్యటన, గ్రామంలోని ఆలయాలు పూలు, విద్యుత్ లైట్లతో శోభాయమానంగా తీర్చిదిద్దడం, గ్రామస్తులు పెద్దఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కొండారెడ్డిపల్లి మొత్తం కోలాహలంగా మారింది.
బతుకమ్మలతో స్వాగతం..
ప్రత్యేక హెలీకాప్టర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం కొండారెడ్డిపల్లికి రానున్నారు. ఈ మేరకు సీఎం హెలీప్యాడ్ వద్ద దిగిన వెంటనే బతుకమ్మ, సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నారు. సోమవారం ఇన్‌చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్, సీఎం భద్రతా అధికారి శ్రీధర్ తదితరులు గ్రామంలో సీఎం పర్యటించే ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు సూచించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంజనేయస్వామి ఆలయం, జమ్మిచెట్టు వద్ద ఎక్కువ సేపు ఉండే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రిని చూసేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టర్, ఎస్పీ సమీక్ష నిర్వహించారు. గ్రామంలో విద్యుత్, తాగునీటి సరఫరాలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, సీఎం సోదరుడు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యటన షెడ్యూల్ ఇలా..
ఉదయం 11.20 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్ నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరుతారు.
మధ్యాహ్నం 12 గంటలకు కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 12.15 నుంచి 12.45 గంటల వరకు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తారు.
అనంతరం సొంతింటికి వెళ్తారు.
మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై మాట్లాడతారు.
సాయంత్రం 6 గంటలకు మైసమ్మ ఆలయం, జమ్మిచెట్టు వద్ద పూజలు చేయడానికి ఇంటి నుంచి బయలుదేరుతారు.
సాయంత్రం 6.45 గంటలకు ఆంజనేయస్వామి ఆలయ వేదిక వద్ద ప్రజలను కలుసుకుని వారితో మాట్లాడతారు.
తిరిగి రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గంలో కొండారెడ్డిపల్లి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.


