● నార్లాపూర్ రిజర్వాయర్‌లో 6 టీఎంసీల నీటి నిల్వ
● గత ఐదురోజుల్లో 2 టీఎంసీలకుపైగా ఎత్తిపోతలు
కొల్లాపూర్: పాలమూరు ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలు సోమవారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. ఈ నెల 14న పాలమూరు ప్రాజెక్టు మొదటి లిఫ్టులోని 2 మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు విద్యుత్ సరఫరాలో సమస్యల కారణంగా 5.30 గంటలపాటు నీటి సరఫరా ఆపేసిన అధికారులు తర్వాత 5 రోజులపాటు నిర్విరామంగా రెండు మోటార్లను నడిపించారు. రెండు మోటార్ల ద్వారా 2 టీఎంసీలకుపైగా నీటిని ఎత్తిపోసినట్లు నీటిపారుదల శాఖ ఈఈ లోకిలాల్‌నాయక్ తెలిపారు. ఒక్కో మోటారు ద్వారా రోజూ 0.25 టీఎంసీ నీటిని ఎత్తిపోశామన్నారు. 14వ తేదీ కంటే ముందు నార్లాపూర్ రిజర్వాయర్‌లో 3.5 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ప్రస్తుతం 6 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉందన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ నీటిని తాగునీటి అవసరాలకు వినియోగిస్తామని, రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గితే వెంటనే మోటార్లను ఆన్‌చేసి ఎత్తిపోతలు చేపడుతామని వివరించారు. మరోవైపు కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు లిఫ్టులో మూడు మోటార్ల ద్వారా నీటి ఎత్తిపోతలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి.


