గద్వాల న్యూటౌన్/ ఎర్రవల్లి: జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం 9వ రోజు నడిగడ్డ ప్రజల ఇలవేల్పు జములమ్మ అమ్మవారు దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే జగజ్జనని మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే జిల్లాకేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి మహాచండి దేవిగా, రెండో రైల్వేగేట్ ప్రాంతంలో తాయమ్మ అమ్మవారు, హౌసింగ్‌బోర్డు కాలనీలోని అయ్యప్పస్వామి ఆలయంలో అన్నపూర్ణేశ్వరి దేవి, కన్యకాపరమేశ్వరీ ఆలయంలో వాసవీమాత మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. కుమ్మరివీధి, గంటవీధి, బాలాజీవీధి, బుర్దపేట, కాలమ్మవీధి తదితర కాలనీల్లో ఏర్పాటు చేసిన మండపాల్లో అమ్మవారిని మహిషాసురమర్దినిగా భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్నారు. సాయంత్రం అమ్మవారికి మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన చేశారు.
సంతానలక్ష్మిగా సరస్వతిదేవి
బీచుపల్లి కోదండరామస్వామి ఆలయంలో సరస్వదేవి అమ్మవారు తొమ్మిదో రోజు సంతానలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


