తాగునీటి పథకానికి పాలమూరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరాకు సిద్ధం
తాగునీటి సరఫరా ఇలా..
● ఎల్లూరు సమీపంలోని సున్నపుతండాలో రూ.140 కోట్లతో పంప్‌హౌజ్ నిర్మాణం
● 1.7 కేవీ సామర్థ్యంతో 6 మోటార్లు ఏర్పాటు
● సీఎం చేతుల మీదుగా
ప్రారంభించేందుకు సన్నాహాలు
నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి నీటిని బయటకు విడుదల చేసే హెడ్ రెగ్యులేటరీ వద్ద పంప్‌హౌజ్ నిర్మాణం చేపట్టారు. 1.7 కిలోవాట్ల సామర్థ్యం గల 6 పంపులను ఏర్పాటు చేశారు. ఇందులో 4 మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేసి, మరో రెండు మోటార్లను స్పేర్‌లో ఉంచనున్నారు. ఒక్కో మోటారు ద్వారా రోజు 9 వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేయవచ్చు. పంప్‌హౌజ్‌కు మిషన్ భగీరథ స్కీం వద్ద ఉన్న 200/11 కేవీ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేయనున్నారు. పంప్‌హౌజ్‌లోని మోటార్లకు సెప్టెంబర్‌లో డ్రై రన్ కూడా నిర్వహించారు. త్వరలోనే సీఎం రేవంత్రెడ్డిచే పంప్‌హౌజ్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పంప్‌హౌజ్ ప్రారంభమైతే మిషన్ భగీరథ స్కీంకు పాలమూరు, కేఎల్ఐ రెండు ప్రాజెక్టుల ద్వారా నీటిని వాడుకునే వెసులుబాటు కలుగుతుంది.
కొల్లాపూర్: త్వరలోనే మిషన్ భగీరథ స్కీంకు నీటి సరఫరా సమస్యలు శాశ్వతంగా తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు భగీరథ స్కీం ద్వారా తాగునీటిని అందిస్తున్న విషయం తెలిసిందే. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని మిషన్ భగీరథ స్కీంకు ప్రస్తుతం ఎంజీకేఎల్ఐ ద్వారా నీటిని సరఫరా చేస్తుండగా.. ఇకపై పాలమూరు ప్రాజెక్టు ద్వారా సరఫరాకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం నార్లాపూర్ రిజర్వాయర్‌కు అనుసంధానంగా పంప్‌హౌజ్ నిర్మించింది. ఈ పనులు దాదాపుగా తుది దశకు చేరగా.. త్వరలోనే పంప్‌హౌజ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రోజు 0.02 టీఎంసీలు..
మిషన్ భగీరథ పథకానికి రోజు 0.02 టీఎంసీల నీళ్లు అవసరం. ఏడాది మొత్తం 8.47 టీఎంసీల నీటిని ఈ పథకానికి వినియోగిస్తున్నారు. స్కీం ప్రారంభమైన నాటి నుంచి కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఇక్కడి నుంచే కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని మిగతా రిజర్వాయర్లు, చెరువులకు కూడా నీటిని తరలిస్తారు. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో మిషన్ భగీరథ స్కీంకు నీటి సరఫరాకు సమస్యలు ఎదురయ్యేవి. 2018లో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తడంతో కృష్ణానది లోతట్టు ప్రాంతం నుంచి నీటిని తరలించేందుకు రూ.6 కోట్లు ఖర్చు చేశారు. 2022లోనూ ఇదే సమస్య తలెత్తడంతో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని సరఫరా చేశారు.
శాశ్వత పరిష్కారం దిశగా..
మిషన్ భగీరథ స్కీంకు వేసవిలో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భావించింది. మిషన్ భగీరథ స్కీంకు సమీపంలోనే పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని నార్లాపూర్ రిజర్వాయర్ కూడా ఉంది. కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీ కాగా.. నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం 6.4 టీఎంసీలు. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్ ద్వారా మిషన్ భగీరథ స్కీంకు నీటిని మళ్లించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రెండు ప్రత్యామ్నాయాలను రూపొందించింది. మొదట నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వతో ఉన్నప్పుడు ఎలాంటి పంపింగ్ లేకుండా స్లూయిస్ ద్వారా ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఫుల్‌గేజ్ నీటి నిల్వ లేని సమయంలో కూడా మిషన్ భగీరథకు నీటిని తరలించేందుకు వీలుగా సున్నపుతండా వద్ద పంప్‌హౌజ్ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం రూ.140 కోట్లు కేటాయించింది. పంప్‌హౌజ్ నిర్మాణం నిదానంగా సాగుతూ.. ఇన్నాళ్లకు తుదిదశకు చేరింది.
పంప్‌హౌజ్‌లోని మోటార్లు
కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్‌హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 84 మండలాల్లో 3,912 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ ట్యాంకులు నిర్మించారు.


