గద్వాలన్యూటౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా దుర్గాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారు శక్తి, ధైర్యం, కరుణ స్వరూపిణి అయిన దుర్గాదేవి రూపంలో సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారు మహిషాసురమర్దినిగా, రెండవ రైల్వైగేట్ ప్రాంతంలో తాయమ్మ అమ్మవారు, హౌసింగ్బోర్డు కాలనీ అయ్యప్పస్వామి ఆలయంలో అన్నపూర్ణేశ్వరిదేవి దుర్గామాతగా దర్శనమిచ్చారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత శృంఖలాదేవి అవతారంలో పూజలందుకున్నారు. కుమ్మరివీధి, గంటవీధి, బాలాజీ వీధి, బుర్దపేట తదితర కాలనీల్లో ఏర్పాటుచేసిన మండపాల్లో అమ్మవారిని దుర్గామాతగా శోభాయమానంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు చేశారు. దుర్గాష్టమిని పురస్కరించుకొని పలు మిల్లులు, ఇళ్లల్లో ఆయుధ, వాహన, యంత్ర పూజలు జరిపించారు. జములమ్మ ఆలయాన్ని ఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా సందర్శించగా.. ఆలయ ఈఓ పురందర్ కుమార్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.


