అమిన్‌గడ్‌ గొర్రె పొట్టేలు | - | Sakshi
Sakshi News home page

అమిన్‌గడ్‌ గొర్రె పొట్టేలు

Oct 19 2026 12:43 AM | Updated on Oct 19 2026 12:43 AM

నారాయణపేట: నారాయణపేటతో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న వంద లాది క్షత్రీయ (ఖత్రి), స్వకున్‌శాలి సామాజిక వర్గాల దసరా ఉత్సవాలు ప్రత్యేకతను చాటుకుంటాయి. ఏటా పండుగను పురస్కరించుకొని మూడురోజుల పాటు నిర్వహించే వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కర్ణాటకలోని అమీన్‌గఢ్‌, కేరూర్‌ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పొట్టేళ్ల కొనుగోలు చేసి పండుగకు అమ్మవారికి బలివ్వడం ఆనవాయితీగా వస్తోంది.

● క్షత్రీయ, స్వకున్‌సాలి సామాజికవర్గానికి చెందిన కుటుంబాలు దుర్గామాతను తమ ఇలవేల్పుగా భావిస్తూ ప్రత్యేక పూజ లు నిర్వహిస్తారు. కొందరు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టగా, మరికొందరు ఒంటిపూట భోజనం చేస్తూ నిష్టతో అమ్మవారిని ఆరాధిస్తారు. దుర్గాష్టమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీపి వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంప్రదాయం ప్రకారం గొర్రె పొట్టేళ్లను బలిచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. సోమవారం బంధుమిత్రులకు మాంసాహార విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మంగళవారం విజయదశమి సందర్భంగా శమీపూజ నిర్వహించి పండుగ జరుపుకొంటారు.

కర్ణాటక పొట్టేళ్లు ప్రత్యేకం..

పండుగ కోసం నారాయణపేటకు చెందిన పలువురు భక్తులు కర్ణాటకలోని అమీనన్‌గఢ్‌, కేరూర్‌ ప్రాంతాల నుంచి గొర్రె పొట్టేళ్లను కొనుగోలు చేసి తీసుకొచ్చారు. మరికొందరు యాద్గిరి, షాపూర్‌ తదితర ప్రాంతాల్లో కొనుగోలు చేశారు. సుమారు రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకు వెచ్చించి పొట్టేళ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఒక్కో పొట్టేలు 40 కిలోల నుంచి 50 కిలోల బరువు ఉంటుందని చెబుతున్నారు. పొట్టేళ్లను ఎంపిక చేసే విషయంలోనూ భక్తులు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. చెవికి గాయం కావడం, కొమ్ము విరగడం వంటి లోపాలున్న వాటిని కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడతారు. పండుగకు ముందుగానే ప్రత్యేక వాహనాల్లో వాటిని నారాయణపేటకు తీసుకొచ్చారు. జిల్లాకేంద్రంలో ఆయా సామాజిక వర్గాలకు చెందిన సుమారు 500 కుటుంబాలు దుర్గామాత పూజల్లో పాల్గొంటాయని స్థానికులు చెబుతున్నారు. పెద్ద పొట్టేలును అమ్మవారికి సమర్పిస్తే తమ కుటుంబాన్ని అమ్మవారు చల్లగా చూస్తారన్నది భక్తుల విశ్వాసం. తమ ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా కుటుంబాలు పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటాయి. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు సైతం దసరా సందర్భంగా స్వస్థలాలకు చేరుకుని పూజల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను ఆహ్వానించి విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల కలయిక, సంప్రదాయ ఆచారాల కొనసాగింపు, దుర్గామాతపై భక్తి విశ్వాసాలతో నారాయణపేటలో ఈ దసరా వేడుకలు ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నాయి.

దసరా వేళ అమ్మవారికి బలివ్వడం ప్రత్యేకం

పేటలో క్షత్రీయ, స్వకున్‌సాలిసంప్రదాయం

అమ్మవారి ఆరాధనలో అనాధిగా వస్తున్న ఆచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement