గద్వాల క్రైం: భూ పోరాట యోధురాలు, పేదల తరపున పెత్తందారులతో పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఐలమ్మ 131 జయంతిని పురస్కరించుకొని ఎస్పీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరుపేదల సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన యోధురాలు అన్నారు. ఆధిపత్య వాదంపై ఎర్రజెండాతో ఎదురునిలిచి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిందన్నారు. ఆమె ఆశయాలను ప్రతిఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. అంతకు ముందు అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా వారి భద్రతకు పోలీసుశాఖ కృషి చేస్తుందన్నారు. ఎవరైనా వారిని నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వయోవృద్ధుల
సంక్షేమానికి కృషి
గద్వాల న్యూటౌన్: వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, సంతోషకరమైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి సునంద అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ సందర్శించి.. అక్కడి వసతులను పరిశీలించారు. వయోవృద్ధులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అక్కడున్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని సిబ్బందికి సూచించారు.
సుంకేసులకు స్వల్ప ఇన్‌ఫ్లో
రాజోళి: సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్న వాగులు, వంకలు, నది పరివాహకంలో కురిసిన వర్షాలతో నదిలో నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా శనివారం డ్యాంకు ఎగువ నుంచి 11 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. కేసీ కెనాల్‌కు మాత్రం 2,445 క్యూసెక్కులు విడుదల చేశారు. డ్యాంలోని స్పిల్ వే గేట్లు తెరవలేదని జేఈ మహేంద్ర తెలిపారు.


