రాజోళి: ‘ఉమ్మడి పాలమూరులోని సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్‌లో ఇచ్చిన పరిహారం అలంపూర్‌లో ఎందుకు ఇవ్వరు.. తనగలలో ఉన్న భూములు వ్యవసాయానికి, ఇతర అన్ని అవసరాలకు సౌకర్యవంతంగా ఉంటాయని దానికి కూడా తక్కువ ధర కేటాయించడం ఎంత వరకు సబబు.. అయినా ఒకే జిల్లాలో రెండు రకాలుగా పరిహారాలు ఇచ్చేందుకు గల కారణాలు తెలియజేయండి.. కొడంగల్ నియోజకవర్గంలో ఇచ్చిన విధంగానే మల్లమ్మకుంట కోసం భూములు కోల్పోతున్న మాకూ పరిహారం ఇవ్వండి’ అని భూ నిర్వాసితులు అధికారులకు తేల్చిచెప్పారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మల్లమ్మకుంట రిజర్వాయర్ భూ పరిహారం విషయమై గురువారం వడ్డేపల్లిలోని ఐకేపీ భవనంలో భూములు కోల్పోతున్న రైతులతో గద్వాల ఆర్డీఓ శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, తహసీల్దార్ శివకుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 577 ఎకరాల వ్యవసాయ భూములు ఈ రిజర్వాయర్ కోసం కోల్పోతున్న తమకు తగిన సరైన పరిహారం ఇవ్వకపోతే తామెలా బతకాలి అంటూ అధికారులను నిలదీశారు. ఎకరాకు రూ.7.50 లక్షలు ఇచ్చారని, దీనిపై కోర్టుకు వెళ్లినా రూ.14 లక్షల వరకే అవకాశం కల్పించారని, ఈ డబ్బుతో కనీసం ఎకర భూమి కూడా కొనుగోలు చేయలేమని రైతులు వాపోయారు. ప్రస్తుతం తనగల, పర్దీపురం గ్రామాల్లో ఎకరా రూ.30 లక్షలు పలుకుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓలో తనగల రైతులు నిర్వాసితులు కాదని ఉందని, భూములు పోతే సర్వం కోల్పోయినట్లేనని.. తప్పకుండా నిర్వాసితులమే అవుతామని చెప్పారు. భూములు కోల్పోతున్న వారిలో ఒకరిద్దరు మినహాయించి, అందరూ చిన్నకారు రైతులేనని వారికి ఈ భూమి తప్ప ఎలాంటి బతుకుదెరువు లేదని, వారికి కూడా ఈ పరిహారంతో సరిపెట్టాలంటే ఎలా అని ప్రశ్నించారు. రిజర్వాయర్ ఏర్పాటు అనంతరం ఫిషరింగ్, బోటింగ్‌పై కూడా స్పష్టత ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెట్టినా తమకు రూ.20 లక్షలకు పైగా పరిహారం ఇస్తేనే భూమి ఇస్తామని తేల్చిచెప్పారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా..
2013 చట్టం ప్రకారం మల్లమ్మకుంట రిజర్వాయర్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు 2013 చట్టం ప్రకారం పరిహారం అందజేస్తామని ఆర్డీఓ శ్రీనివాసరావు చెప్పారు. రూ.14 లక్షల పరిహారం ఇవ్వడంతోపాటు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు, కుల వృత్తుల వారికి చేయూత, ఫిషరింగ్, బోటింగ్, జాతీయ రహదారిపై స్థానికులకే అవకాశం వచ్చేలా కృషిచేస్తామన్నారు. అయితే రైతులు మాత్రం తమకు ఎట్టి పరిస్థితుల్లో రూ.20 లక్షలకుపైగా పరిహారం చెల్లిస్తేనే మాట్లాడతామని, లేదంటే కోర్టులో చూసుకుంటామని అన్నారు. ఇక్కడ జరిగిన అంశాలన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఆర్డీఓ చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, ఆర్‌ఐ వేణుగోపాల్‌రెడ్డి, నర్సింహరాజు, రైతులు పాల్గొన్నారు.
కొడంగల్‌కు ఒకలా.. మాకొకలా ఇవ్వడం ఎంత వరకు సబబు
మల్లమ్మకుంట వ్యవహారంపై అధికారులను నిలదీసిన రైతులు
సర్వే ముగిశాక మరోమాట
చెప్పడంపై మండిపాటు
రూ.20 లక్షలపైనే ఇస్తేనే భూములిస్తాం
వడ్డేపల్లిలో రైతులతో సమావేశమైన
ఆర్డీఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్


