గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన 17 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సివిల్ సమస్యలు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
విద్యుత్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ ముట్టడి
ధరూరు: ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధిస్తున్న అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. విద్యుత్ కోతలతో కళ్ల ముందే పంటలు ఎండుముఖం పడుతుండడంతో రైతులు మండలంలోని ద్యాగదొడ్డి సబ్‌స్టేషన్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. పంటలకు సాగు నీరందక ఇబ్బందులు పడుతున్నామని, గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ రైతులకు కరెంటు ఇవ్వడంలో విఫలమైందని దుయ్యబట్టారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
వేరుశనగ @ రూ.8,410
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు సోమవారం 369 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టం రూ.8,410, కనిష్టం రూ.4,619, సరాసరి రూ.6,549 ధరలు లభించాయి.
నేడు మార్కెట్ యార్డు బంద్
గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు మంగళవారం బంద్ ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం దడవాయిలు మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించే రాష్ట్ర సదస్సుకు హాజరుకానున్నారు. ఇందుకోసం సెలవు ప్రకటించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దడవాయిల సంఘం నాయకులు స్థానిక అధికారులకు విన్నవించారు. ఇందుకు అధికారులు సమ్మతించారు. దీంతో యార్డుకు ఎలాంటి పంట ఉత్పత్తులు తీసుకురావద్దని దడవాయి సంఘం అధ్యక్షుడు తిరుపతి రైతులను కోరారు.
గ్రామాల అభివృద్ధికి
అధిక ప్రాధాన్యం
గట్టు: మండలంలోని బస్వాపురం నుంచి తుమ్మలచెర్వు స్టేజీ వరకు రూ.1.50 కోట్ల వ్యయంతో కొత్త బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, ప్రతి గ్రామంలోనూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్‌కుమార్, సర్పంచు శ్రీరాములుగౌడ్, వైస్‌ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఆనంద్‌గౌడు తదితరులు ఉన్నారు.
విద్యార్థుల కోసం పోరాటం చేస్తే అరెస్టులా?
అయిజ: పేద విద్యార్థుల పెండింగ్ ఫీజులను చెల్లించాలని పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న నాయకులను సోమవారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు. కార్యక్రమంలో నరసింహ, భీంసేన్‌రావు, ప్రదీప్ కుమార్, భగత్‌రెడ్డి, వెంకటేష్, రాజేశేఖర్, భీమన్న, శ్రీకాంత్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.


