గద్వాల న్యూటౌన్: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్వజారోణం, గణపతి పూజ చేశారు. సాయంత్రం చేపట్టిన ఎదుర్కోళ్ల ఉత్సవం వైభవంగా సాగింది. అమ్మవారిని, స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి, జమ్మిచేడులోని ఆంజనేయస్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తు ఆలయానికి తీసుకొచ్చారు. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలతో సందడి నెలకొంది. ఆలయ ఈఓ పురందర్‌కుమార్, మాజీ చైర్మన్లు సతీష్, వెంకట్రాములు ప్రత్యేక పూజలు చేశారు.
నేడు కల్యాణ మహోత్సవం
ఏటా శ్రావణ మాసంలో చివరి మంగళవారం అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా రకరకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. భారీ కల్యాణ వేదిక, భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:15 గంటలకు జరిగే కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురానున్నారు. మున్సిపల్ చైర్మన్ తుమ్మల జయలక్ష్మితో పాటు జిల్లాలోని ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.


