ధరూరు: ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని మన్నాపురం గ్రామ శివారులో రైతు వెంకటేశ్వరరెడ్డి పొలంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పామాయిల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటిన తర్వాత మూడేళ్లలో పంట దిగుబడి ప్రారంభమవుతుందని, 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం అనేక రకాల రాయితీలు అందిస్తోందని రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రైతులు ఆయిల్‌పాం పంటలను జిల్లావ్యాప్తంగా రూ.13 కోట్ల విలువ చేసే పంటను విక్రయించారని డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి కరుణ తెలిపారు. ఈ ఏడాది కూడా లక్ష్యం మేరకు రైతులతో పంట సాగు చేయిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రైతు శివరాజ్, మండల ఉద్యానవన శాఖ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.
పల్లి @ రూ.7,290
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 109 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ.7,290, కనిష్టంగా రూ.5,169, సరాసరిగా రూ.7,290 ధరలు పలికాయి.


