గట్టులో నిధుల దుర్వినియోగంపై విచారణ | - | Sakshi
Sakshi News home page

గట్టులో నిధుల దుర్వినియోగంపై విచారణ

Aug 26 2026 1:00 AM | Updated on Aug 26 2026 1:00 AM

గట్టు: గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం డివిజినల్‌ పంచాయతీ అధికారి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గట్టులో విచారణ చేపట్టారు. గట్టు పంచాయతీకి సంబంధించి రూ.22 లక్షలను ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు పక్కదారి పట్టించారని, వీటిపై సమగ్ర విచారణ నిర్వహించాలని మాజీ సర్పంచు ధనలక్ష్మి డీపీఓకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం మండల పరిషత్‌ కార్యాలయంలో విచారణ నిర్వహించిన అధికారులు, మధ్యాహ్నం తర్వాత పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచు భర్త కృష్ణమూర్తి, వార్డుసభ్యులు సంతోష్‌, తిమ్మప్ప నిధుల డ్రాపై వాగ్వాదం చేసుకున్నారు. పనులు చేయకుండానే పంచాయతీ నిధులు డ్రా చేశారని, వీటిపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వార్డుసభ్యులు విచారణ అధికారికి విన్నవించారు. ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు మునినాయక్‌, కుర్మన్న, జగన్నాథరావు ద్వారా గడిచిన ఐదు నెలల్లో డ్రా చేసిన నిధులు, వాటికి సంబంధించిన బిల్లులను డీఎల్‌పీఓ పరిశీలించారు. అంతకు ముందు డీఎల్‌పీఓ మత్స్యకార కమ్యూనిటీ హాల్‌ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్‌ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించాలని మత్స్యకారులు కోరగా.. వాల్మీకుల కోసమని మరి కొంతమంది పట్టుబట్టారు. కమ్యూనిటీ హాల్‌ వెనక ఖాళీ స్థలం విషయమై విచారణ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీఓ ఖాజా, సర్పంచు నాగరాజు, మాజీ సర్పంచు ధనలక్ష్మి, ఉప సర్పంచు అంజనమ్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement