గద్వాల: నడిగడ్డలో ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు అన్న చందంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నవారు సహజంగా అధికారంలో ఉన్నవారిని నిలదీస్తూ.. ప్రజాపక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలి. కానీ, అలంపూర్‌లో బీఆర్‌ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే విజయుడు మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలిలా.. బుధవారం అధికార పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి జిల్లాలోని ధరూరు మండలం ర్యాలంపాడు ముంపు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయుడు ఇద్దరు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ప్రభుత్వ కార్యక్రమం అనుకుందామంటే గద్వాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే హాజరవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరోవైపు ఇదేరోజు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులతోపాటు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సైతం కర్ణాటకలోని ఆర్డీఎస్‌ను సందర్శించారు. ఆర్డీఎస్‌కు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్‌ఎస్ నేతలు అధికార పార్టీపై విమర్శలు చేస్తుండగా.. మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే విజయుడు అధికార పార్టీ మంత్రులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంతకు ఎమ్మెల్యే విజయుడు దారెటు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
మంత్రులను కలిసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
మరోవైపు ఆర్డీఎస్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్ నాయకులు
ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే.. ఎమ్మెల్యే మంత్రులకు స్వాగతం పలకడంపై చర్చ


