రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

Jul 9 2026 6:29 AM | Updated on Jul 9 2026 6:29 AM

కందనూలు: నాగర్‌కర్నూల్‌ నూతన బస్టాండ్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలో పర్యటించిన ఆయన పట్టణంలోని బస్‌ డిపో సమీపంలో నాలుగు ఎకరాల స్థలంలో రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికుల సౌకర్యాలు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేసేలా రూపుదిద్దుకోనున్న నూతన బస్టాండ్‌ నిర్మాణ పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ప్రజలు సైతం ఆర్టీసీని తమ సొంత సంస్థగా భావించి ఆదరించాలని, ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఈసారి వర్షాలు ఆశించిన స్థాయి ్డలో కురవకపోవడంతో రైతులు నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో అధిక లాభాలు ఇచ్చే పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.

లాభాల బాటలో ఆర్టీసీ..

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌.. నేడు రవాణా శాఖను సమర్థవంతంగా నడిపిస్తూ ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపించే ప్రయత్నాలు జరిగాయని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం సంస్థను మరింత బలోపేతం చేస్తోందన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. ఉయ్యాలవాడలో రూ.200 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రితోపాటు రూ.12 కోట్లతో అత్యాధునిక బస్టాండ్‌ నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు. నాగర్‌కర్నూల్‌కు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నాగర్‌కర్నూల్‌ నుంచి వయా తూడుకుర్తి మీదుగా వనపర్తికి ప్రయాణించే బస్సును వారు జెండా ఊపి ప్రారంభించారు.

365వ బస్టాండ్‌గా

నాగర్‌కర్నూల్‌కు ప్రత్యేక గుర్తింపు

4 ఎకరాల స్థలంలో అత్యాధునిక

హంగులతో నిర్మాణం

రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement