కర్ణాటకలో అక్రమ ప్రాజెక్ట్‌లతో పాలమూరు ఎడారే.. | - | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో అక్రమ ప్రాజెక్ట్‌లతో పాలమూరు ఎడారే..

Jul 9 2026 6:29 AM | Updated on Jul 9 2026 6:29 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘తుంగభద్ర నదిపై ఎగువన కర్ణాటకలో అక్రమంగా నిర్మిస్తున్న చిక్కలమర్రి, కురిడి, గుండ్రేవుల ప్రాజెక్ట్‌లతో నడిగడ్డ మాత్రమే కాదు.. పాలమూరు శాశ్వతంగా ఏడారిగా మారే ప్రమాదం ఉంది. ఆర్డీఎస్‌, కల్వకుర్తి, పీఆర్‌ఎల్‌ఐ ఇలా అన్నింటికీ నీటి కష్టాలు తప్పవు. బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. పార్టీలకతీతంగా పాలమూరు ప్రజలను ఏకం చేస్తాం. పాలమూరును ఎడారిగా మార్చే కుట్రలను తిప్పికొడతాం.’ అని మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి హెచ్చరించారు. బుధవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మాన్వి తాలుకాలోని రాజోలి బండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌) ఆనకట్టను సందర్శించారు. తెలంగాణకు నీరు వచ్చే ఆర్డీఎస్‌ ఎడమ కాల్వ షెటర్లు, పేరుకుపోయిన పూడికతోపాటు సమీపంలో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న కురిడి డ్రింకింగ్‌ వాటర్‌ స్కీంను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బచావత్‌ ట్రిబ్యునల్‌కు వ్యతిరేకంగా కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు తుంగభద్ర, కృష్ణా నదులపై అనేక అక్రమ ప్రాజెక్ట్‌లు, బ్యారేజీలు నిర్మిస్తున్నాయని.. దీనివల్ల కృష్ణా నదిపై ఆధారపడి ఉన్న ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.

కాంగ్రెస్‌ నేతలు స్పందించకపోవడం

శోచనీయం..

కర్ణాటకలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లకు సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ అనుమతులు లేవని.. ఇంత జరుగుతున్నా పాలమూరు బిడ్డ అని చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ నేతలు స్పందించకపోడం శోచనీయమన్నారు. ఏపీ ఓ పక్క అడ్డగోలుగా నీరు తరలించుకుపోవడంతోపాటు కుడి కాల్వ పేరుతో ప్రాజెక్ట్‌ నిర్మిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితేనే స్వరాష్ట్ర ఉద్యమం జరిగిందన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదన్నారు. కాగా, కురుడి ఎత్తిపోతల సందర్శన క్రమంలో అక్కడికి కర్ణాటక ఇరిగేషన్‌ అధికారులు రాగా.. ఏ అనుమతులతో ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని వారు సమాధానమివ్వగా.. కేఆర్‌ఎంబీ, సీడబ్ల్యూసీ, కేంద్ర జలశక్తి శాఖ అనుమతులు ఉండాలని.. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులు నిలిపివేయాలని సూచించారు. ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డి, జైపాల్‌యాదవ్‌, అంజయ్యయాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, నాయకులు ఆంజనేయులు గౌడ్‌, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

‘కురిడి’తో కొద్ది నీరు కూడా రాదు..

ఆర్డీఎస్‌ ప్రాజెక్ట్‌ను నిజాం కాలంలో తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించారని మాజీ మంత్రులు గుర్తు చేశారు. అయితే రాయచూర్‌ ప్రాంతం కర్ణాటకలో కలిసిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణకు ట్రిబ్యూనల్‌ కేటాయించిన 15.9 టీఎంసీల వాటా దక్కడం లేదని.. కేవలం 1.2 టీఎంసీల వాటా ఉన్న కర్ణాటకనే ఎక్కువ ప్రయోజనం పొందుతోందన్నారు. ఇప్పటివరకు భారీగా భారీగా దోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక.. తెలంగాణకు వచ్చే కొద్ది నీరు సైతం రాకుండా అడ్డుకునేందుకు కురిడి ఎత్తిపోతలను నిర్మిస్తోందని దుయ్యబట్టారు. తాగునీటి పేరుతో 2 టీఎంసీల సామర్థ్యంతో 100 మీటర్ల దూరంలోనే లిఫ్ట్‌ను నిర్మిస్తోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్డీఎస్‌ పరిరక్షణ కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టామని.. తాజాగా కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతలతో ఆ కొద్ది నీరు కూడా నడిగడ్డకు అందే పరిస్థితి ఉండదన్నారు.

మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి

కర్ణాటకలోని ఆర్డీఎస్‌ను సందర్శించిన బీఆర్‌ఎస్‌ బృందం

అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లనుపరిశీలించిన నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement