గద్వాల: జిల్లాలో మొదటి దశలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో రీసర్వే పనలు వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ కార్యదర్శి లోకేష్‌కుమార్, సర్వే కమిషనర్ రాజీవ్‌గాంధీ హనుమంతు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ నోటిఫై చేసిన ప్రతి గ్రామంలో ఆలస్యం లేకుండా గ్రామసభలు నిర్వహించి రీసర్వే ప్రారంభించాలన్నారు. నవంబర్ నాటికి మొదటి దశ గ్రామాల్లో వచ్చే ఏడాది మార్చి నాటికి మిగిలిన గ్రామాల్లో సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు పనిని పర్యవేక్షించాలని, రెవెన్యూ సిబ్బందికి ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరలోనే సర్వేయర్లతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రాజోళి, ఎర్రవల్లి, తహసీల్దార్ కార్యాలయాలతోపాటు గద్వాల, అలంపూర్ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు, సర్వే ఏడీ నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
చదువులో రాణించాలి
అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని కలెక్టర్ అన్నారు. ఉన్నత చదువులు అభ్యసించి రాణించాలని కోరారు. ఇటిక్యాల మండలం వావిలాల గ్రామానికి చెందిన విద్యార్థి లెనిన్‌కుమార్‌కు గురువారం కలెక్టర్ ల్యాప్‌టాప్‌ను అందజేశారు. అలాగే అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన రమేష్– సురేఖ కులాంతర వివాహం చేసుకోవడంతో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రోత్సాహకంగా రూ.2.50 లక్షల విలువైన పిక్స్‌డ్ డిపాజిట్ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత తదితరులున్నారు.


