నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

నేరస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

గద్వాల క్రైం: నేరస్తుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో శాంతిభద్రతల విషయాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీసు పికెటింగ్‌ నిర్వహించి అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారణ చేపట్టాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద నిఘా ఉంచి ప్రతి గూడ్స్‌ వాహనాలు, కంటైనర్లను తనిఖీ చేయాలన్నారు. సమస్యలపై వచ్చే బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని సూచించారు. అనుమతి లేకుండా ఇసుక, మట్టి, రేషన్‌ బియ్యం, నిషేధిత మత్తు పదార్థాలు, గంజాయి రవాణాను నివారించాలని, పేకాట స్థావరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా చేపట్టాలని ఆదేశించారు. సిబ్బందిపై బాధితులు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నమోదైన కేసుల విషయంలోనూ నిర్లక్ష్యం లేకుండా వీలైనంత త్వరగా కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లాలో జోనల్‌ లెవల్‌ డ్యూటీ మీట్‌లో కంప్యూటర్‌ పరిజ్ఞానం, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ లిఫ్టింగ్‌ అండ్‌ ప్యాకింగ్‌, బాంబ్‌ డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌ తదితర విభాగాల్లో ఉత్తమ ప్రతిభకనబర్చి స్టేట్‌ లెవల్‌ డ్యూటీకి ఎంపికై న గద్వాల సీఐ శ్రీను, ఎస్‌ఐలు శ్రీకాంత్‌, శ్రీహరి, తరుణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది ప్రహ్లాద్‌, రాఘవేంద్ర, నవీన్‌కుమార్‌లను ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, ప్రదీప్‌కుమార్‌, ఎస్‌ఐలు కల్యాణ్‌ కుమార్‌, నాగశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement