కేటీదొడ్డి: ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కేంద్రాలుగా నిలవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. శుక్రవారం ధరూర్ మండలంలోని ర్యాలంపాడులో నిర్వహిస్తున్న కేటీదొడ్డి మహాత్మ జ్యోతిబాపులే తెలంగాణ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్య, వసతి, భోజన సౌకర్యాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం అధికారుల బాధ్యత అన్నారు. పోషకాహారం అందించాలని, హాస్టళ్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు విద్యా ప్రగతి, క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు.


