‘ఉపాధి’కి ఊతం! | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’కి ఊతం!

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

గద్వాలన్యూటౌన్‌: ఈ నెలలో వ్యవసాయ పనులు ఉండవు. గ్రామీణ కూలీలకు ఉపాధిహామీ పనులే దిక్కు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పథకం ద్వారా ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 200 మంది కూలీలకు పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఎంపికచేసిన కొన్ని పనులకు ప్రాధాన్యత ఇస్తూ.. అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించారు.

వలసలు వెళ్లకుండా..

సాధారణంగా మే ప్రారంభం నుంచి జూన్‌ మొదటి వారం వరకు వ్యవసాయ పనులు ఉండవు. దీంతో వేలాది మంది కూలీలు ఇతర పనులకు వెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో స్థానికంగా పనులు దొరక్కపోతే.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఎందుకంటే కూలీ పనుల ద్వారా వచ్చే డబ్బుతోనే వారి కుటుంబ పోషణ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించాలని స్పష్టంగా ఆదేశించింది. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం ఒక్కో జీపీలో సరాసరి 70 మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఒక్కో గ్రామ పంచాయతీలో కనీసం 200 మంది కూలీలకు పనులు కల్పించడం ద్వారా వలసలను నివారించడంతో పాటు కూలీలు ఆర్థికపరమైన ఇబ్బందులు పడకుండా ఉంటారని.. వారి కుటుంబ పోషణకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు బావిస్తున్నారు.

కొన్ని పనులకు ప్రాధాన్యత..

ఉపాధిహామీ పథకం ద్వారా ప్రధానంగా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత కల్పిస్తారు. ఇంకా ఇంకుడు గుంతలు, వ్యవసాయ పొలాల చదును, కంపోస్ట్‌ పిట్‌లు, నాడేక్‌ కంపోస్ట్‌ పిట్‌లు, పండ్లతోటలు, పశువుల పాకాలు, కోళ్ల షెడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, నర్సరీలు, వంటగదులు తదితర పనులు చేపడతారు. అయితే జూన్‌లో వర్షాకాలం ప్రారంభవుతుంది. చెరువులు, ఊటకుంటలు, కాల్వల్లో పనులు చేయడం ఇబ్బంది. ఇదే సమయంలో పొలాలకు ఒండ్రుమట్టి అవసరం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం కాల్వల్లో షిల్ట్‌ తొలగింపు, చెరువులు, ఊటకుంటల్లో ఒండ్రుమట్టి పూడికతీత, ఇంకా పశువులకు నీటి ఎద్దడి లేకుండా నీటితొట్ల నిర్మాణం, గొర్రెలు, పశువులకు పాకాలు తదితర పనులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ప్రతి జీపీలో 200 మందికి పనులు కల్పించేలా ప్రణాళిక

జూన్‌ మొదటి వారం వరకు

వ్యవసాయ పనులు కరువు

గ్రామీణ కూలీలకు ఇబ్బందులు

తలెత్తకుండా ఉపాధి కల్పన

వేసవిలో నీటి సంరక్షణ

పనులకు ప్రాధాన్యం

Advertisement
 
Advertisement
Advertisement