రైతుకు కూర‘గాయాలు’ | - | Sakshi
Sakshi News home page

రైతుకు కూర‘గాయాలు’

Mar 16 2026 7:37 AM | Updated on Mar 16 2026 7:37 AM

జిల్లాలో సాగు.. అనుకూలించని వానాకాలం..

యాసంగిలో

అధిక ఉష్ణోగ్రతల ప్రభావం

పెరిగిన ఉష్ణోగ్రతలతో పంట కాపాడుకోవడానికి తిప్పలు

యాజమాన్య పద్ధతులు పాటించాలి

గద్వాల వ్యవసాయం: కూరగాయలు సాగు చేసిన రైతులు విలవిలలాడుతున్నారు. బావులు, బోర్లలో ఉన్న నీటి లభ్యత ఆధారంగా సాగు చేసిన కూరగాయల పంటను అధిక ఉష్ణోగ్రతలు దెబ్బతీస్తున్నాయి. వేడి కారణంగా పూత రాలుతోంది. కాయలు వచ్చిన చోట వాటి రంగులు మారుతున్నాయి. వాతావరణ మార్పులతో దిగుబడులు తగ్గి, ఆర్థికంగా నష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో సాధారణ పంటలతో పాటు రెండు సీజన్లతో కలిపి ఏటా దాదాపు 10 వేల ఎకరాల్లో ఇక్కడి రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్‌, క్యాబేజీ, ధరూర్‌ మండలంలో బెండ, టమాట, మల్దకల్‌ మండలంలో చిక్కుడు, టమాట, బీర, సోరకాయ, బెండ, కాకర, అయిజలో బెండ, చిక్కుడు, వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌, ఉల్లి, అలంపూర్‌లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాట, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటతో ఆయా మండలాల్లో ఆకుకూరలు సైతం సాగు చేస్తారు.

ఏటా వానాకాలం సీజన్‌లో 4 వేల నుంచి 5 వేల ఎకరాల్లో, యాసంగిలో 3 నుంచి 4 వేల ఎకరాల్లో కూరగాయలు సాగు అవుతున్నట్లు ఉద్యానశాఖ రికార్డులు చెబుతున్నాయి. అయితే 2025–26 వానాకాలం సీజన్‌ కూరగాయల రైతులను తీవ్ర నిరాశకు గురి చేసింది. జిల్లా వ్యాప్తంగా 3,750 ఎకరాల్లో సాగు చేయగా.. జూన్‌, జూలైలో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. ఆగస్టు, సెప్టెంబర్‌లో కురిసిన అధిక వర్షాలు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దిగుబడులు గణనీయంగా తగ్గాయి. పలుచోట్ల వర్షపు నీరు నిలిచి తోటలు నీట మునిగాయి. అక్టోబర్‌లో కురిసిన వర్షాలు సైతం నష్టాన్ని మిగిల్చాయి. చేతికి వచ్చిన కొద్దిపాటి కూరగాయలు సైతం రంగులు మారడంతో నాణ్యత తగ్గి బహిరంగా మార్కెట్‌లో ఆశించిన ధర పలకలేదని రైతులు వాపోయారు.

వానాకాలంలో కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులో భూగర్భ జలం పెరిగింది. దీంతో యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2,450 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారు. కొంతమంది రైతులు విత్తనాలు వేయగా.. చాలా మంది నారుమళ్లతో కూరగాయల సాగు చేశారు. అయితే గడిచిన ఇరవై రోజల నుంచి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. తెల్లవారుజామున చలిగా ఉంటుండగా.. ఉదయం 9గంటల నుంచే ఉష్ణోగ్రతలు మొదలవుతున్నాయి. అప్పటి నుంచి క్రమేణ ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. అధికంగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు భూమిలో తేమశాతం తగ్గిపోయింది. దీంతో కూరగాయల పూత రాలుతోంది. మొక్క పెరగడం లేదు. ఎండవేడిమికి టమాట, క్యాప్సికం, క్యాలిఫ్లవర్‌, కాకర, బీర, వంకాయ తదితర కూరగాయల రంగులు మారి, సైజులు తగ్గిపోతున్నాయిని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టుపైనే కాయలు కుచించుకుపోతున్నాయని అంటున్నారు. పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితులు కనబడటం లేదని వాపోతున్నారు. వానాకాలంలో అధిక వర్షాలతో, యాసంగిలో అధిక ఉష్ణోగ్రతలతో ఆర్థికంగా నష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూమిలో తగ్గిన తేమశాతం

రాలుతున్న పూత..

మారుతున్న కాయల రంగులు

దిగుబడిపై తీవ్ర ప్రభావం

కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీని ప్రభావం కూరగాయల పంటలపై ఉంటుంది. ఎండ వేడిమి తగలకుండా షెడ్‌నెట్‌లు ఏర్పాటు చేసుకోవాలి. కాయలు, పూత రాలకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. రైతులు ఉద్యానశాఖ అధికారుల, సిబ్బంది సలహలు, సూచనలు తీసుకోవాలి.

– ఎంఏ అక్బర్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement