చేపలు విలవిల! | - | Sakshi
Sakshi News home page

చేపలు విలవిల!

Mar 15 2026 5:08 AM | Updated on Mar 15 2026 5:08 AM

మృతిచెందిన చేపలు

తొలగించాలి..

చెరువులో చనిపోయిన చేపలను తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా గోతి తీసి పూడ్చిపెట్టాలి. వెంటనే సున్నమును హెక్టారుకు 100 నుంచి 250 కిలోల మోతాదులో చల్లాలి. అప్పటికీ అదుపులోకి రాకుంటే నీటినాణ్యత పెంచే రసాయనాలు అనగా బీకేఎస్‌ను హెక్టార్‌కు లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యలతో నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై ఉన్న పరాన్న జీవులు చనిపోతాయి. ప్రాణ వాయువు పెంచడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్‌ చేయాలి. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే వేసవిలో చేపలు చనిపోకుండా ఉంటాయి.

– డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ

అమరచింత: జిల్లాలోని చెరువులు, కుంటలతో పాటు రిజర్వాయర్‌లలో మత్స్యకారులు చేపల పెంపకం చేపడుతున్నారు. వేసవిలో నీరు వేడెక్కి ఆక్సిజన్‌ అందక మృతిచెందే ప్రమాదం ఉంటుంది. తగిన ముందస్తు చర్యలు చేపడితే చేపలు మృతి చెందకుండా నివారించే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈసారి రాయితీ చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో ఎదుగుదల లేక మత్స్యకారులు ఆందోళన చెందుతున్న తరుణంలోనే ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో ఉన్న చేప పిల్లలను ఎలా బతికించుకోవాలని సతమతమవుతున్నారు. వేసవిలో అధిక ఉష్ణ్రోగ్రత, చేపల సాంద్రత అధికంగా ఉండటం, నీరు క్రమేపి తగ్గడంతో నీటిలో ప్రాణవాయువు కొరత, నాణ్యత తగ్గిపోవడం తదితర కారణాలతో చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటాయి. రోగకారక సూక్ష్మజీవులతో వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున మత్స్యకారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు.

నిషితంగా పరిశీలిస్తే..

చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలికలను రోజు గమనిస్తూ ఉండాలి. మచ్చుకు కొన్ని చేపలు పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక మరియు రెక్కల స్వభావంతో పాటు మొప్పల రంగు, పై జిగురు లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. తేడాలు గమనించిన తర్వాత సంబంధిత మత్స్యశాఖ అధికారి సలహాలు, సూచనలు తీసుకొని నివారణ చర్యలు సత్వరమే చేపడితే ఆర్థిక నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు.

వేసవిలో ఆక్సిజన్‌ అందక మృతిచెందే ప్రమాదం

జాగ్రత్తలు పాటిస్తే నియంత్రణ సాధ్యం

అవగాహన కల్పిస్తామంటున్న మత్స్యశాఖ అధికారులు

ఆక్సిజన్‌ మోతాదు గుర్తించండి ఇలా..

ఉదయాన్నే చేపలు చెరువు పైభాగాన నోరు తెరుచుకొని తిరుగుతుంటే ప్రాణవాయువు కొరత ఉందని గమనించాలి. అలాంటి సమయంలో చెరువులో నీరు పెట్టడం, అది సాధ్యం కాని పక్షంలో పెద్ద చేపలను పట్టి విక్రయించడంతో కాస్త నష్టాన్ని అధిగమించవచ్చు. చేపల సాంద్రత తగ్గడంతో ప్రాణవాయువు కొరత అధిగమించవచ్చు. చేపలు మార్కెట్‌ సైజ్‌ రాలేదని, ధర తక్కువగా ఉందని, ఐస్‌ దొరకడం లేదనే కారణాలతో నిర్లక్ష్యం చేయొద్దు. చెరువులో నీటి నాణ్యత తగ్గినప్పుడు సున్నము ఒక హెక్టారుకు 100 నుంచి 250 కిలోల వరకు చల్లితే నీటి నాణ్యత పెరగడమే కాకుండా ప్రాణవాయువు శాతం పెరిగి ఉదని సూచికను అదుపులో ఉంచుతుంది.

చెరువులో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తగ్గిస్తూ ఉండాలి. లేనియెడల రాత్రిళ్లు అవి కార్బన్‌ డై ఆకై ్సడ్‌ విడుదల చేయడంతో ప్రాణవాయువు కొరత ఏర్పడి చనిపోయే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో మత్స్యకారులు గిట్టనివారు విషం కలిపారని అనుమానిస్తూ ఉంటారు. విషం కలిపితే పెంచే కర్పూజాతి చేపలే కాకుండా కొర్రమట్ట, మార్పు, జెల్లలు మొదలైన తక్కువ ఆక్సిజన్‌ను తట్టుకునే చేపలు, కప్పలు, నీటి పాములు సైతం చనిపోతుంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Advertisement
 
Advertisement
Advertisement