జాగ్రత్తలు తప్పనిసరి
● చిన్నారుల రక్షణపై పోలీసు నిఘా
● ఈత కొట్టేందుకు వెళ్లి
ఇటీవల ఓ విద్యార్థి మృతి
● గతేడాది జరిగిన ఘటనలపై ఆరా
గద్వాల క్రైం: వేసవి సెలవుల్లో చిన్నారులు వినోదం కోసం ఎంచుకునే మార్గాలు విషాధం కాకూడదని పోలీసులు సూచిస్తున్నారు. వేసవి తాపం నుంచి రక్షణ పొందేందుకు చెరువులు, బావులు, నీటి గుంతల్లో ఈత పడేందుకు పిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో సరదా కోసం ఈత పడే సమయంలో కొందరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో పోలీసులు నిరంతరం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈత రాని వారు నీటి కుంటలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి కొందరు బావుల్లో సరదా ఆటల పేరుతో ఎక్కువ సేపు మునగడం, మరికొన్ని వింత చేష్టలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. బావుల్లో కంప చెట్లు, రాళ్లు ఉండడంతో వాటిలో చిక్కుకొని మరికొందురు మృత్యువాత పడుతున్నారని, ఈత వెళ్లే సమయంలో ఇలాంటి ప్రమాదాలను గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు. గతేడాది ఏడుగురు చిన్నారులు ఈతకు వెళ్లి మృతి చెందడంతో జిల్లా వ్యాప్తంగా చెరువులు, బావులు, నీటి గుంతల పరిసర ప్రాంతాల్లో పోలీసుశాఖ నిఘా ఏర్పాటు చేసింది.
ఘటనలు..
● మల్దకల్ మండలంలోని అమరవాయి గ్రామానికి చెందిన విద్యార్థి (13) ఈ నెల 8 వ తేదీన తోటి స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు.
● అయిజ మండలం మూగోనిపల్లికి చెందిన విద్యార్థి (10) మార్చి 16, 2025 న గ్రామ సమీపంలోని బావిలో ఈత కొట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలోకి పై నుంచి దూకగా.. నీటిలో ఉన్న కర్ర ముక్క గొంతుకు గుచ్చుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడు.
● గట్టు మండల కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి (17) ఏప్రిల్ 10, 2025 న గ్రామం సమీపంలోని బావికి ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు.
పిల్లలకు వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు రక్షణగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లల సంతోషాలను స్వీకరిస్తూనే వారిని సరైన మార్గంలో తీసుకువెళ్లాలి. చిన్నారులకు ఈత నేర్చించాలనుకుంటే తల్లిదండ్రులే దగ్గరుండి తీసుకెళ్లాలని కోరారు. వాళ్లకు స్నేహితులకు ఈత వచ్చు అని, వారే నేర్పిస్తారనే ధోరణిలో తల్లిదండ్రులు ఉంటే అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే వేగంగా స్పందించేందుకు పిల్లల్లో ఆలోచనా శక్తి తక్కువగా ఉంటుందని తెలిపారు. ఒంటరిగా నీటి కుంటల వద్దకు వెళ్లకూడదని అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులకు ఈత నేర్పించే సమయంలో మొదట వాళ్లు అలవాటు పడే వరకు రక్ష ణ చర్యలు తీసుకోవాలని సూ చించారు. తప్పనిసరిగా లైఫ్‌జాకెట్లు, కట్టెలతో తయారు చేసిన బెండ్లు వాడాలన్నారు. కొన్నిసార్లు పిల్లలకు ఖాళీ ప్లాస్టిక్ క్యాన్లను కట్టి పంపి స్తారని, అలా చేయకూడదన్నారు. అనుకోని పరిస్థితుల్లో వాటిలోకి నీరు వెళితే చిన్నారులు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్వీయ జాగ్రత్తలపై నిరంతరం అవగాహన కల్పిస్తాం. వ్యవసాయ బావులు, రిజర్వాయర్లు, నీటి కుంటల వద్దకు పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై గ్రామ పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశాం. నిరుపయోగంగా ఉన్న బోరు వెల్స్‌ను మూసివేసేలా గ్రామ పంచాయతీ, మున్సిపల్ అధికారులు చొరువ తీసుకోవాలి. దీనిపై కళాజాత బృందం ఆధ్వర్యంలో అవగాహన సదస్సుల ద్వారా వివరిస్తాం. తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహరించాలి. ప్రమాదభరితంగా ఉన్న బావులు, చెరువులు, నీటి కుంటల వద్ద ప్రహారీ ఏర్పాటుకు కృషి చేస్తాం.
– శ్రీనివాసరావు, ఎస్పీ


