
కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
గద్వాలటౌన్: కాంట్రాక్టు వర్కర్ల క్రమబద్ధీకరణ, కనీస వేతనాలు, పెన్షన్ తదితర డిమాండ్ల సాధన కోసం కార్మికులు కదం తొక్కారు. గురువారం టీయూసీఐ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ నుంచి నిరసన ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు హనుమంతు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీస వేతనాల జీఓ అమలు కాకపోవడంతో కాంట్రాక్టు సిబ్బంది చాలీచాలని జీతాలతో కాలం గడుపుతున్నారన్నారు. కాంట్రాక్టు సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు కృష్ణ, చెన్నరాములు, శంకరన్న, మహేశ్వరమ్మ, రంగన్న, నాగరాజు, వెంకటరామిరెడ్డి, భీమన్న, బీచుపల్లి, నల్లాస్వామి, సలీం, రాజు తదితరులు పాల్గొన్నారు.