వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Aug 2 2025 11:15 AM | Updated on Aug 2 2025 11:15 AM

వైద్య పోస్టులకు  దరఖాస్తుల ఆహ్వానం

వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

గద్వాల: అలంపూర్‌ ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్టు విధానంలో వైద్యాధికారుల నియామకాలు చేపడుతున్నట్లు అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌చంద్ర శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలంపూర్‌ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌–2, జనరల్‌ సర్జన్‌–2, జనరల్‌ మెడిసిన్‌–2, అనస్తిటిస్ట్‌–2, ఈఎన్‌టీ–1, ఆర్థోపెడిక్‌–1, పాథాలజిస్ట్‌–1, సైక్రియార్టిస్ట్‌–1, డెర్మటాలజిస్ట్‌–1 పోస్టు ఖాళీగా ఉన్నాయని, అదేవిధంగా అలంపూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో జనరల్‌ మెడిసిన్‌–1, పిడియాట్రీషియన్‌–1, జీడీఎంవో(ఎంబీబీఎస్‌)–2 కాంట్రాక్టు పోస్టులకు దరరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుదారులు ఈనెల 7వ తేదీన అలంపూర్‌ ఏరియా ఆసుపత్రి, అలంపూర్‌ క్రాస్‌రోడ్డులో వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు.

ఆపరేషన్‌ ముస్కాన్‌లో

75 మంది బాలలకు విముక్తి

గద్వాల క్రైం: జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ –11 విజయవంతమైందని, మొత్తం 75 మంది బాలకార్మికులను గుర్తించి విముక్తి కల్పించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గద్వాల – అలంపూర్‌ సెగ్మెంట్‌లో జులై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు, కార్మిక, విద్య, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేశాయని, పలు ప్రాంతాల్లో బాలకార్మికులుగా పని చేస్తున్న 75 మంది చిన్నారులను గుర్తించి వారిని వెట్టి నుంచి విముక్తి కల్పించామని తెలిపారు. అనంతరం చిన్నారులను పాఠశాలలో చేర్పించామని, వారిని పనిలో పెట్టుకున్న యజమానులపై 18 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైన చిన్నారులను పనిలో పెట్టుకుంటే డయల్‌ 100 లేదా 1098కు సమాచారం అందించాలని, ఆపరేషన్‌ ముస్కాన్‌లో విధులు నిర్వహించిన సిబ్బంది కృషి మరువలేనిదని తెలిపారు.

కేంద్రం నిధులిస్తే.. కాంగ్రెస్‌ ప్రారంభోత్సవాలా ?

అలంపూర్‌: కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చి నిర్మిస్తే కాంగ్రెస్‌ మంత్రులు ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. అలంపూర్‌లోని ప్రసాద్‌ స్కీం భవనంలో బాలబ్రహ్మేశ్వర నిత్య అన్నదాన సత్రాన్ని, ఏర్పాట్లను ఆయనతోపాటు బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం ప్రసాద్‌ స్కీం పథకం ద్వారా జోగుళాంబ ఆలయానికి 2021లో రూ.80 కోట్లు పలు భవనాలు, అభివృద్ధి పనుల కోసం కేటాయించారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.36.72 కోట్లు మాత్రమే వినియోగించుకున్నట్లు తెలిపారు. నిర్మించిన వసతి గృహాలను సైతం వినియోగంలోకి తేవడానికి సరైన చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ భవనంలో భక్తుల సౌకర్యార్థం కళ్యాణమండపం, ఆడిటోరియం వంటివి అందుబాటులోకి రావాల్సి ఉందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ప్రసాద్‌ స్కీంలోని సౌకర్యాలతోపాటు నిత్య అన్నదాన సత్రం తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యాక్షుడు రాజశేఖర్‌ శర్మ, బీజేపీ నాయకులు రాజగోపాల్‌, నాగేశ్వర్‌ రెడ్డి, శరత్‌, ఈశ్వర్‌, మురళికృష్ణ, రామకృష్ణ, నాగమల్లయ్య ఉన్నారు.

జీవన ప్రమాణాలు

మెరుగుపడాలి: వీసీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరం అని పాలమూరుయూనివర్సిటీ వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు పీయూలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో ఆర్థిక విద్య, జీవన నైపుణ్యాలు అనే అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యా విధానం–2020 ప్రకారం నైపుణ్య ఆధారిత పరిజ్ఞానం అవసరం అన్నారు. విద్యార్థి దశలోనే ఆర్థిక అవగాన పెంచుకుని, దేశ స్థూల జాతీయోత్పత్తిలో మీ వంతు పాత్ర పోషించాలన్నారు. కీనోట్‌ స్పీకర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌ బ్రహ్మ, రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, మధుసూదన్‌రెడ్డి, అర్జున్‌కుమార్‌ పాల్గొన్నారు.

వేరుశనగ క్వింటా రూ.6,570

గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌ యార్డుకు శుక్రవారం 622 క్వింటాళ్ల వేరుశనగ రాగా గరిష్టం రూ. 6570, కనిష్టం రూ. 2276, సరాసరి రూ. 5370 ధరలు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement