
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● అధికారులు సమన్వయంతో పనిచేయాలి..
● నిర్లక్ష్యం వహిస్తే వేటుతప్పదు
● కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల: గురుకులాలు, సంక్షేమ శాఖల వసతిగృహాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు. శుక్రవారం ఐడీవోసీ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పాఠశాలలు, హాస్టళ్లల్లో నిర్వాహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా తగిన వేటుతప్పదన్నారు. ఇటీవల ఓ పాఠశాలలో జరిగిన ఘటనపై సంబంధిత డిప్యూటీ వార్డెన్, సూపర్‌వైజర్‌లను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిర్లక్ష్యం వహించిన ఇతర సంబంధిత అధికారులకు కూడా మొమోలు జారీ చేసినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంక్షేమం కోసం మండల స్థాయి అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలన్నారు. అన్ని మండలాలకు జిల్లా స్థాయి స్పెషల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. ప్రతినెలా కనీసం రెండుసార్లు పాఠశాలలు సందర్శించి అక్కడి విద్య, భద్రతా, మౌళిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు ఇతర అవసరాలను సమీక్షించాలన్నారు. విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం నాణ్యమైన పోషకాహారంతో కూడిన భోజనం తప్పనిసరిగా అందించాలన్నారు. ఏదైనా సమస్యలు తలెత్తితే వెంటనే తహసీల్దార్, ఎంపీడీవో పోలీసు అధికారులకు తెలియపర్చాలని తహసీల్దార్ మండల స్థాయి మెజిస్ట్రేట్ వెంటనే స్పందించాలన్నారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
అనంతరం ఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. జిల్లాల్లో ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే పోలీసుశాఖ అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుందని, వసతిగృహాల ప్రతివిషయం అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వ్యక్తులు ఎవరైనా విద్యార్థులను రోడ్డుపైకి వచ్చేలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహాల్లోకి బయటి వారిని అనుమతించకూడదని వసతిగృహాల విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యాలయాల ఆవరణలో ఎవరైనా మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మండల స్థాయిలో అధికారులు, పోలీసువిభాగం పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు, అధికారులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీస్తీదవాఖానాను ఆకస్మింకగా తనిఖీ చేశారు. దగ్గు, జలుబు, జ్వరం నివారణకు సంబధించి మెరుగైన వైద్యం అందించాలని, దోమల నివారణకు ఆయిల్‌బాల్స్, బ్లీచింగ్ వంటి నివారణ కారకాలను ఉపయోగించాలన్నారు.
ఎరువుల కొరత సృష్టించొద్దు
రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని, వాటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ అన్నారు. రైతు నుంచి ఆధార్ వివరాలు సేకరించిన అనంతరమే యూరియా విక్రయాలు చేయాలని, ఈ–పాస్ ద్వారా అమ్మకాలు జరగాలన్నారు. జిల్లాలో ఎరువుల నిల్వలు, వినియోగంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని డీఏవో సక్రియానాయక్‌ను ఆదేశించారు.