
రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి
అయిజ: ప్రైవేటు స్కూల్ బస్సులను నిబంధనల మేరకు నడుపుకోవాలని.. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని డీటీఓ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గురువారం అయిజలో ప్రైవేటు స్కూల్ బస్సులను మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ రాములు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణారెడ్డిలతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనుమతి పత్రాలను పరిశీలించారు. బస్సు సీటింగ్ కెపాసిటీ మేరకు విద్యార్థులను తరలించాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతిలో జిల్లాకు ఒక సీటు కేటాయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2018 జూన్ 1నుంచి 2019 మే 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలని.. గ్రామీణ ప్రాంతాల వారి వార్షిక ఆదాయం రూ. 1.50లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారి వార్షికాదాయం రూ. 2లక్షలు మించరాదన్నారు. దరఖాస్తు ఫారాలు ఎస్సీ సంక్షేమాభివృద్ధిశాఖ కార్యాలయంలో పొందవచ్చన్నారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని.. 10న కలెక్టరేట్‌లో లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
మెరుగైన వైద్యం
అందించాలి
ఇటిక్యాల: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.సిద్దప్ప అన్నారు. గురువారం ఇటిక్యాల పీహెచ్‌సీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. డీఎంహెచ్‌ఓ వెంట ఎంసీహెచ్ పోగ్రాం అధికారి డా.ప్రసూనారాణి, డీపీఎన్‌ఎం వరలక్ష్మి, మండల వైద్యాధికారి రాధిక తదితరులు ఉన్నారు.
వేరుశనగ @రూ. 6,189
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు గురువారం 725 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 6,189, కనిష్టంగా రూ. 3,352, సరాసరి రూ. 4050 ధరలు లభించాయి.

రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరి