
మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
అలంపూర్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గురువారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాలు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రితో పాటు ఎమ్మెల్యే విజయుడు, కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే 2,600 మహిళా సంఘాలకు రూ. 3.15కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు చెప్పారు. పలు పెట్రోల్ బంకులు, 1000 ఆర్టీసీ బస్సులకు మహిళా సమాఖ్యలను యజమానులుగా చేసిందన్నారు. మహిళల పేరుపైనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించారని.. అదే తరహాలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక పేదలకు రేషన్‌కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. అలంపూర్ నియోజకవర్గంలో 2,041 మహిళా సంఘాల సభ్యులు ఉండగా.. బ్యాంకు లింకేజీ రుణాలు రూ. 30.58 కోట్లు, 2,600 సంఘాలకు రూ. 3.15 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. 23మందికి రూ. 13.89లక్షల బీమా చెక్కులు అందజేసినట్లు వివరించారు. కొత్తగా 3వేల రేషన్ కార్డులు మంజూరు కాగా.. 19వేల మంది పేర్లను కొత్తగా నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం గొర్రెలకు నీలినాలుక వ్యాధి నిరోధక టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.
ఎన్నికల్లో ఇచ్చిన
ప్రతి హామీని అమలు చేస్తాం
రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి