
ఎర్రమట్టి గుట్టలను పరిశీలించిన విజిలెన్స్
అలంపూర్: మండలంలో ఎర్రమట్టి గుట్టలను కొల్లగొడుతున్న వైనంపై జూలై 27న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఆగని మట్టి దందా’ కథనానికి రాష్ట్ర విజిలెన్స్ అధికారులు స్పందించారు. గురువారం విజిలెన్స్ డీఎస్పీ శ్రీనివాస్, ఏడీఎంజీ కేఎల్‌ఎన్ రావు, ఆర్‌ఐ సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి సుల్తానాపురం, రేలంపాడు శివారుల్లో ఉన్న గుట్టలను పరిశీలించారు. గుట్టల్లో మట్టి తవ్వకాలతో పాటు ఇసుక అక్రమ రవాణాపై ఆరా తీసినట్లు తెలిసింది. మట్టి తవ్వకాలు ఎంత మేర జరిగాయనే దానిపై నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులకు సూచించినట్లు సమాచారం. అయితే విజిలెన్స్ అధికారులకు తగిన సమాచారం ఇవ్వడంలో స్థానిక అధికారులు దోబూచులాడటంపై విమర్శలు వ్యక్తవుతున్నాయి. ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నా.. కనీస సమాచారాన్ని రహస్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ విషయమై మైనింగ్ అధికారులను ఫోన్‌లో సంప్రదించగా.. అందుబాటులోకి రాలేదు. విజిలెన్స్ అధికారుల వెంట ఆర్‌ఐ దుర్గాసింగ్ ఉన్నారు.

ఎర్రమట్టి గుట్టలను పరిశీలించిన విజిలెన్స్