శ్రీ సరస్వతి ఆలయం
పునాది పనులు షురూ
కాళేశ్వరం: కాళేశ్వరాలయం పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీ సరస్వతి ఆల యం పునాది పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆలయం గర్భగుడి పునాది పనులు రాయితో నిర్మిస్తున్నారు. విజయగణపతి, శ్రీశుభానందదేవి, శ్రీసుబ్రహ్మణ్యస్వామిఆలయ పునాది పనులు పది రోజులుగా సాగుతున్నాయి. పడమర వైపున ప్రహరీతో పాటు ప్రాకార పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. ఽశనివారం సరస్వతి అమ్మవారి ఆలయాన్ని దక్షిణం వైపున 15ఫీట్ల వెడల్పు, 21ఫీట్ల పొడవుతో రాయితో పునాదిని నిర్మించారు. దక్షిణం వైపు ఆగ్నేయంలో రామాలయం నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా దక్షిణం వైపున పనులు ముగింపు తరువాత ఉత్తరం వైపున సూర్యదేవాలయం, యాగశాల పనులు మొదలు పెడుతారని తెలిసింది. ప్రాకారాల మండపాల డిజైన్లు తయారుచేస్తున్నారు.
రేపటినుంచి రాత్రి వేళల్లోనూ..
ఈ నెల 21న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు సంబంధితశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో పనుల్లో వేగం పెంచి రాత్రిపగలు పనిచేసి పూర్తి చేయాలని ఆదేశించారు. సోమవారం నుంచి రాత్రి వేళల్లో పనులు చేయడానికి విద్యుత్ ఏర్పాట్లు చేపట్టారని తెలిసింది.
దుకాణాలు తీయాల్సిందే..
కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన టెండర్ దుకాణాలు దక్షిణం, తూర్పువైపు సగం వరకు తొలగింపు నేపథ్యంలో అడవిలోని ఆదిముక్తీశ్వరాలయానికి వెళ్లాల్సిందే. తూర్పు వైపున ప్రాకారం తొలగింపు పనులు జరుగుతుండడడంతో ముందున్న బొమ్మలు, కొబ్బరి కాయలు, పూజాసామాను, హోటళ్లు, ఇతర దుకాణాలన్నీ తీసేయాల్సిన పరిస్థితి నెలకొంది. వారికి ఇప్పటికే ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాట్లు జరిగాయి. వచ్చే ఏడాది జూన్ 25 నుంచి జూలై 7 వరకు కాళేశ్వరంలో జరుగనున్న గోదావరినది పుష్కరాల వరకు అందేలా మంత్రి డి.శ్రీధర్‌బాబు, దేవాదాయ, ఆర్‌అండ్‌బీశాఖలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నేడు దక్షిణం, ఉత్తరం, తూర్పు ప్రాకారాల తొలగింపు
రేపటి నుంచి రాత్రి వేళల్లోనూ పనులు
నేడు మళ్లీ తొలగింపు పనులు..
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా మొదటగా పడమర వైపు గోపురంతో పాటు ప్రాకారం మొత్తం తొలగించారు. ఉత్తరం, దక్షిణం వైపు సగం వరకు ప్రాకారాలతో గోపురాలను తొలగించి, వెలుపల ఉన్న ఆలయాలన్ని తొలగించి పునర్నిర్మాణం చేపట్టారు. సగం మిగిలి ఉన్న దక్షిణం, తూర్పు, ఉత్తరం వైపున్న ప్రాకారాలను ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆదివారం తొలగించనున్నారని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. సరస్వతీనది పుష్కరాల సమయంలో నిర్మించిన దక్షిణం వైపున్న క్యూ కాంప్లెక్సు కూడా తొలగిస్తారు. కానీ తూర్పు రాజగోపురం తొలగింపుపై ఇంకా స్పష్టత రాలేదు.


