● సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్
మల్హర్ (కాటారం): కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలోని గొంతెమ్మ గుట్టపై ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు చీఫ్ కన్జర్వర్టర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. అటవీశాఖ అధికారులతో కలిసి గొంతెమ్మ గుట్టను ఆయన బుధవారం సందర్శించారు. ట్రెక్కింగ్ చేసి గుట్టపైకి చేరుకున్నారు. గొంతెమ్మ గుట్ట చరిత్ర, పర్యాటక విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాచీన ఆనవాళ్లు, ప్రాముఖ్యంపై ఆరా తీశారు. పర్యాటకం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, పర్యాటకుల భద్రత, సౌకర్యాల కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీసీఎఫ్ ప్రభాకర్ మాట్లాడుతూ గొంతెమ్మ గుట్టను పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం, వన మహోత్సవంలో భాగంగా ప్రతాపగిరి గ్రామపంచాయతీ పరిధిలో అధికారులతో కలిసి పలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మహాదేవపూర్, భూపాలపల్లి ఎఫ్‌డీఓలు సందీప్, అప్పలకొండ, ఎఫ్‌ఆర్‌ఓ స్వాతి, డిప్యూటీ రేంజర్ సురేందర్, ఎఫ్‌బీఓలు, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


