● కలెక్టర్ రాహుల్ శర్మ
గణపురం: అర్హులైన ఓటర్లందరికీ ఓటుహక్కు ఉండేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం నిర్వహించిన సర్ ప్రత్యేక గ్రామసభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో గుర్తించిన అనామలిస్, మ్యాపింగ్ కేసులు, నోటీసుల జారీ విచారణ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచనల మేరకు గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ వార్డులో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రెండు నెలలుగా సర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. సర్‌లో భాగంగా బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందించారని తెలిపారు. 2002 నాటి ఓటర్ల జాబితాలో మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టి ఫారాలను పూర్తి చేసినట్లు తెలిపారు. అనంతరం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వివరించారు. డ్రాఫ్ట్ జాబితాలో ప్రధానంగా నో మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లను గుర్తించినట్లు తెలిపారు. ఈ కేటగిరిల్లో ఉన్న ఓటర్లకు బీఎల్‌ఓల ద్వారా నోటీసులు జారీ చేస్తామని వారు విచారణ హాజరై అవసరమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు. జిల్లాలో సుమారు 35వేల అనామలీస్, నో మ్యాపింగ్ కేసులు ఉన్నాయని తెలిపారు. నోటీసులు జారీ విచారణ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులకు తుది జాబితాలో చోటు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మండలంలో డ్రాఫ్ట్ ప్రక్రియకు ముందు 33,493 మంది ఓటర్లు ఉండగా సర్ ప్రక్రియలో 3,371 ఓట్లు తొలగించడంతో ప్రస్తుతం 30,122 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. మండలంలో ప్రస్తుతం 36 పోలింగ్ స్టేషన్లు ఉండగా కొత్తగా మరో మూడు పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, స్థానిక సర్పంచ్ కట్కూరి రాధిక తదితరులు పాల్గొన్నారు.
భూ రీసర్వేకు చర్యలు
భూపాలపల్లి: జిల్లాలో భూదార్ కార్డుల జారీకి చేపట్టిన రీసర్వే పనులకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు 22ఏ నిషేధిత భూములపై అర్జీలు, భూభారతి, సాదాబైనామా, రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో గురువారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడారు. ఈ నెల 31న రెవెన్యూ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున అధికారులు పూర్తి సమాచారంతో సన్నద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో గుర్తించిన 70 గ్రామాల్లో రీ సర్వేలో ఖచ్చితమైన కొలతలు నిర్వహించి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, సబ్ రిజిస్ట్రార్ బాలకిషన్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


