భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడంతో పాటు తదితర సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీఈజేఏసీ చైర్మన్ బూరుగు రవి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్‌సీ అమలు చేస్తామని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీనిచ్చి 30 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం టీజీఈజేఏసీ ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ నాలుగు నెలలుగా హెల్త్ స్కీమ్ సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ స భ్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ జీఓ నంబర్ 25తో ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేస్తూ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. విద్యారంగంలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్, శ్రీనివాసరావు, రాజకుమార్, తిరుపతి, అజహర్, శ్రీనివాస్, శ్రీదేవి ప్రవీణ్, సాంబశివరావు, కిరణ్ కుమార్, నక్క తిరుపతి, దశరథ రామారావు, షఫీ అహ్మద్, జ్ఞానేశ్వర్ సింగ్, మురళీధర్‌రెడ్డి, కుమారస్వామి, మందల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ
ఆధ్వర్యంలో ధర్నా


