● జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు ఉద్యోగుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. ఏరియా జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించిన సేఫ్టీ రివ్యూ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏరియా సేఫ్టీ అధికారి మాటూరి రవీందర్ సమావేశానికి అధ్యక్షత ఏర్పాటు చేసిన సమీక్షలో ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో అమలవుతున్న భద్రతా చర్యలు, సేఫ్టీ నిబంధనల అమలు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు, ఉద్యోగుల భద్రత, తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఆయా విభాగాల్లో భద్రతకు సంబంధించిన సమస్యలను జీఎం దృష్టికి అధికారులు తీసుకురాగా, వాటిపై చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. భద్రతే ప్రధానం అనే భావనతో ప్రతీ అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జీఎం తెలిపారు. సమావేశంలో ఏరియా ఇంజనీర్ సాంబశివరావు, సెక్యూరిటీ ఆఫీసర్ మురళీమోహన్, జీవీటీవీ మేనేజర్ నజీర్, సేఫ్టీ విభాగం అధికారులు పాల్గొన్నారు.


