నేడు కోటంచలో కుంకుమార్చన పూజలు | - | Sakshi
Sakshi News home page

నేడు కోటంచలో కుంకుమార్చన పూజలు

Aug 21 2026 2:45 AM | Updated on Aug 21 2026 2:45 AM

రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నేడు (శుక్రవారం) సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ బిళ్ల శ్రీనివాస్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం గజవాహన సేవపై అమ్మవారిని ఊరేగించి, తదుపరి ప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

కోటగుళ్లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్‌

రంజిత్‌ నాయక్‌

గణపురం: మండలకేంద్రంలోని కోటగుళ్ల శిల్పసంపద అద్భుతంగా ఉందని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్‌ రంజిత్‌ నాయక్‌ అన్నారు. గణపసముద్రం చెరువు కట్టపై నిర్మిస్తున్న రిసార్ట్స్‌తో పాటు కోటగుళ్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటగుళ్లు, గణపసముద్రం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ సిద్ధంగా ఉందన్నారు. వెంటనే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారులు శివాజీ, రఘు, ఏఐ కీర్తికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్‌గాంధీ సేవలు

చిరస్మరణీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి రూరల్‌: దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్‌గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువతకు అవకాశాలు కల్పించడం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా దేశాన్ని ఆధునిక దిశగా నడిపించిన గొప్పనాయకుడు రాజీవ్‌ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు దాట్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

దరఖాస్తుల స్వీకరణ

భూపాలపల్లి రూరల్‌: భూపాలపల్లి, మహదేవపూర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్‌ సంక్షేమాధికారి మల్లీశ్వరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 (నేటి) నుంచి సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement