● మాజీ ఎమ్మెల్యే గండ్ర
వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా, రాస్తారోకోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పదేళ్లపాటు అమలు చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పథకాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతులకు ఎకరాకు రూ.15వేల సాయం, రైతు బీమా వంటి ఎన్నికల హామీలను కూడా వెంటనే అమలు చేయాలని కోరారు. రైతు బీమా ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.


